Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో అన్యమత ప్రచారం కలకలం, ఆలయాలపై అన్యమతాల గుర్తులు, రాతలు
జలుమూరు: శ్రీకాకుళం జిల్లాలో హిందూ దేవాలయాల గోడలపై అన్యమత ప్రచారం, అన్య మతాలకు చెందిన గుర్తులు కనిపించడం దుమారం రేపుతోంది. జలుమూరు మండలం కామేశ్వర పేట, కాముడు పేట, ఎలమంచిలి గ్రామాల్లో ఆలయాలతో పాటు ఇండ్ల గోడలపై శిలువ గుర్తులు, క్రైస్తవ సూక్తులు రాయడం కలకలం రేపుతోంది. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ పిచ్చి పనులకు పాల్పడ్డారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
300 ఏళ్ల చరిత్ర ఉన్న ఎలమంచిలిలోని ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయంతో పాటు సమీప గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలపై క్రైస్తవ మతానికి సంబంధించిన రాతలు, శిలువ గుర్తులు దర్శనమిచ్చాయి. ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, RSS, VHP ప్రతినిధులు ఈ దారుణంపై మండిపడుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని.. వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ గోడలపై ఉన్న అన్యమతాలకు చెందిన గుర్తులు, రాతలు చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు.
Just In
కేసు దర్యాప్తు చేయకుండా ఆలయాలపై పిచ్చి రాతలు, గీతలను ఎలా చెరిపేస్తారు అంటూ అడ్డుకున్న గ్రామస్తులు, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పోలీసులను అడ్డుకున్నారు. దాంతో ఎలమంచిలి గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగాది పండుగ రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిన వారిని గుర్తించి తక్షణమే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.
"This is a breaking news story and is being updated. Please refresh for the latest updates."