YS Jagan Mohan Reddy | తాడేపల్లి: ఏపీలో జరుగుతున్న దారుణాలపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నది తమ ప్రయత్నమని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని.. పొలిటికల్ గవర్నెన్స్ ను టేకోవర్ చేసి నడిపిస్తున్నారని విమర్శించారు. ఈ పాలనతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఏపీలో .ప్రజాస్వామ్యం, చట్టంగానీ వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అధికార కూటమిలో ఉన్నాయని, ప్రజల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
వైఎస్ జగన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా మొత్తం 143 హామీలు ఇచ్చి ప్రజలను మోసం అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా చంద్రబాబు పరిపాలన చేశారు. ప్రభుత్వం మోసాలను ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సా్ర్ సీపీ. ప్రతిపక్షపార్టీగా ప్రజల పక్షాన, వారి సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఏడాది కాలంలో మేం ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకకుండా అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తోంది కూటమి ప్రభుత్వం.
డిసెంబర్ 13, 2024న రైతు సమస్యలకు సంబంధించిన రైతు భరోసా, గిట్టుబాటు ధరలపై అన్నదాతల తరఫున ప్రశ్నించాం. ఉచిత పంటల బీమా ఎత్తివేయడం, ఇన్‌పుట్ సబ్సిబీని నీరుగార్చడంపై అన్నదాతకు అండగా అనే పేరుతో వైసీపీ పోరాటం చేసి ప్రశ్నించింది. డిసెంబర్ 25న కరెంట్ చార్జీల బాదుడపై నిలదీశాం. ఎన్నికల సమయంలో తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు.. రూ.25000 కోట్లు కొత్త ఛార్జీల భారం ప్రజలపై మోపారు.
పిల్లల చదువుతో చంద్రబాబు చెలగాటం ఆడారు. వసతి దీవెన ఇవ్వని పక్షంలో చదువు మానేస్తున్నారు. నిరుద్యోగ భృతి హామీపై యువతకు మార్చి 12న యువత పోరు నిర్వహించాం. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం నిర్వహించాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాంది మంది బాధిత ప్రజలను కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన హామీలను చూపించాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బాండ్లపై ప్రజలకు వాస్తవాలు వివరించినట్లు’ తెలిపారు.
బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ హామీలతో చేసిన మోసాలను ప్రజలకు వివరించాం. ఏడాది కాలంలో ఏయే వర్గాలకు ఎంత డబ్బులు ఇవ్వాలని అన్ని వర్గాల వారికి వివరించాం. వైసీపీ ఇచ్చినట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించేలా ప్రజలను చైతన్యవంతులు చేశాం. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమం, ప్రస్తుతం మండలస్థాయిలో జరుగుతోంది. మేనిఫెస్టో హామీలు, బాండ్లపై, ప్రజలకు ఎంత బాకీ పడ్డారన్న వివరాలతో జులై 21 గ్రామ స్థాయిలో కూటమి నేతలను ప్రజలు నిలదీసేలా వారికి అంతా వివరిస్తాం. సమస్యలు వివరించినా చేసే వ్యక్తి కాదని చంద్రబాబును నేతలు సైతం కలవడం లేదు. మరోవైపు అధికార దుర్వినియోగంతో ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.