Police Gandikota girl murder case : జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ బాలిక హత్య కేసు మలుపులు తిరుగుతోంది. సోమవారం ఉదయం కాలేజ్‌కు వెళ్లకుండా తన ప్రియుడు లోకేష్‌తో కలిసి గండికోటకు వెళ్లింది. తర్వాత లోకేష్ ఒక్కడే బండి మీద వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే తర్వాత రోజు ఉదయం ఆ బాలిక చనిపోయి గండికోట వద్ద కనిపించింది. ఈ ఘటనలో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. 

ఉదయం కాదు రాత్రే  బాలికను చంపేశారు..?  

బాలిక ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్న మొత్తం వివరాలు బయటకు తీశారు. ఆ యువకుడు చెప్పిన దాని ప్రకారం ఉదయం తాము గండికోటకు  వెళ్లిన విషయం తెలుసుకున్న బాలిక బంధువులు.. కోట దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. వారు బాలికను తమతో తీసుకెళ్లారు. దాంతో తాను ఒంటరిగా తిరిగి వచ్చానని లోకేష్ పోలీసులకు తెలిపాడు.           

ప్రియుడితో వెళ్లిన సమయంలో వచ్చి పట్టుకున్న బంధువులు         

అదే సమయంలో బాలికను అప్పుడే హత్య చేసి ఉంటే.. తర్వాత రోజు ఉదయం వరకూ తెలియకపోతే బాడీ డీ కంపోజ్ అయ్యేది. కానీ తమ బిడ్డను హత్య చేసి గండికోట వద్ద పడేశారని పోలీసులకు  బాలిక  బంధువులే సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూసి .. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికి  బాలిక చనిపోయి.. కొన్ని గంటలే అవుతుందని.. అంటే అర్థరాత్రి తర్వాత చంపేసి ఉంటారని వైద్య నివేదికల్లో తేలింది. దీంతో అసలు చంపింది లోకేష్ కాదని.. పెద్ద గూడుపుఠాణి ఉందని పోలీసులకు స్పష్టత వచ్చింది. అందుకే వారు.. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై లైంగిక దాడి కూడా జరగలేదని నివేదికలో వెల్లడయింది.         

ప్రియుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన బాలిక బంధువులు 

లోకేష్ తో కలిసి బాలిక గండికోటకు వెళ్లిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లారు..  బాలికను ఎవరు తీసుకెళ్లారు. ఎప్పుడు చంపేశారు అన్నదానిపై సంపూర్ణమైన ఆధారాలు పోలీసులు వెలికి తీస్తున్నారు. లోకేష్ తో ప్రేమాయణం విషయంలో కుటుంబసభ్యుల మాటల్ని వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన బాలిక కాలేజీకి వెళ్లలేదు. ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లింది.ఈ విషయం తెలియడంతో బాలిక బంధువు గండికోటకు వెళ్లారు.  వారే ఏదో చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.  

పరువు హత్య చేసి .. ప్రియుడిపై తోసేసే ప్లాన్ చేశారా? 

ఈ కేసును పోలీసులు దాదాపుగా చేధించారు. పరువు హత్యగా భావిస్తున్నారు. ప్రియుడు లోకేష్ ..  బాలికను చంపలేదని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఆ యువకుడ్ని ఇరికించడానికి పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దర్యాప్తు కొలిక్కి వచ్చింది. పోలీసులు అధికారికంగా.. వివరాలను ప్రకటించనున్నారు. ఇది పరువు హత్యేనని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.