శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీ బట్టలకు ప్రసిద్ధిగాంచిన సంగతి తెలిసిందే. అయితే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పొందూరుకు చెందిన ఓ ఖాదీ కార్మికురాలికి ప్రధానికి కలిసే అవకాశం దక్కింది. నిన్న (ఆగస్టు 15) ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ జెండా వందనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన 70 ఏళ్ల పెద్దావిడకు ఆహ్వానం అందింది. ఆమె ఖాదీ వడుకే కార్మికురాలు. పేరు జల్లేపల్లి కాంతమ్మ. ఈమెకు ప్రధాని నరేంద్ర మోదీతో కొద్ది సేపు ముచ్చటించే అరుదైన అవకాశం దక్కింది. 


ఆగస్టు 15న ఉదయం స్పెషల్ గ్యాలరీలో జల్లేపల్లి కాంతమ్మ కూర్చున్నారు. ఆ సమయంలో ఆ గ్యాలరీ వద్దకు వచ్చిన ప్రధాని మోదీకి కాంతమ్మను అధికారులు పరిచయం చేశారు. ఆమెను పలకరించిన ప్రధాని మోదీ కాసేపు ఖాదీ ప్రత్యేకతపై మాట్లాడారు. పొందూరుకు చెందిన ఖాదీ వడికే కార్మికుడు బల్ల భద్రయ్య, ఆయన భార్య లక్ష్మికి కూడా ప్రధానిని అక్కడే కలిసి మాట్లాడే అవకాశం దొరికింది.