జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం, ప్రభుత్వ తీరుపై విమర్శలను కొనసాగిస్తున్నారు. తాజాగా మరో స్థాయిలో ఎద్దేవా చేస్తూ మంత్రులను ఉద్దేశించి ఓ కార్టూన్ ను కూడా వదిలారు. దాన్ని ఏకంగా అమెరికాలోని ఓ ప్రఖ్యాత మౌంట్‌తో పోల్చారు. అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ ‘రష్ మోర్’ పర్వతం తరహాలో కార్టూన్ తయారు చేయించి ఈ మౌంట్ ‘దిల్ మాంగే మోర్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
రష్ మోర్’ పర్వతంపై ప్రముఖుల ముఖచిత్రాలు చెక్కి ఉంటాయి. అలాగే రుషికొండ పర్వతంపై కూడా నలుగురు మంత్రుల ముఖ చిత్రాలను కార్డూన్‌లో చూపించారు. రుషికొండ తవ్వకాలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు.
‘‘విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్’’ ఇది “ధన - వర్గ - కులస్వామ్యానికి చిహ్నం” (బూతులకి కూడా…)’’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో మూడు రాజధానుల అంశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అని వైఎస్ఆర్ సీపీ నాయకులు భావిస్తే, ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ సీపీ వారు చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతం అన్నట్లు విశ్వసిస్తారు. అలాగే ప్రవర్తిస్తారు. రాష్ట్ర ప్రజలు ఏమి అనుకుంటున్నారో లేదా అడుగుతున్నారో వారు కొంచెం కూడా పట్టించుకోరు.’’
అలాగే ఏపీని కూడా ‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర’’ గా ప్రకటించండి. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి. ‘‘ఏపీని మీ వైఎస్ఆర్ సీపీ రాజ్యంగా మార్చుకోండి’’ దయచేసి సంకోచించకండి, ఆలోచించకండి.’’ అంటూ మరో ట్వీట్ చేశారు.
ఇష్టమొచ్చిన ఫిగర్లు వద్దు బాబూ - గుడివాడ అమర్‌నాథ్
పవన్ కల్యాణ్ ట్వీ్ట్ చేసిన వెంటనే పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ఏపీలో 25 జిల్లాలు లేవని 26 ఉన్నాయని గుర్తు చేశారు. ఇష్టం వచ్చిన ఫిగర్లు వద్దు బాబూ అంటూ సెటైర్లు వేశారు. ‘‘బాబూ.. కల్యాణ్ ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. 25 కాదు. ఇష్టం వచ్చిన ‘‘ఫిగర్లు’’ వద్దు బాబూ!’’ అని ట్వీట్ చేశారు.
పవన్ వరుస విమర్శలు
పవన్ కల్యాణ్ మూడు రాజధానులు, విశాఖ గర్జన సభలను ఉద్దేశిస్తూ ఘాటుగా వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దేనికి గర్జనలు అంటూ ప్రశ్నించారు. ‘‘దేనికి గర్జనలు? ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?’’ అంటూ ప్రశ్నించారు. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?’’ అంటూ మరో ట్వీట్ చేశారు.