Visakha Steel plant | విశాఖపట్నం: మనం బలంగా నిలబడ్డాం.. పోరాడాం కాబట్టే రాష్ట్రంలో సుస్థిరపాలనకు బీజాలు పడ్డాయని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయవద్దు అని మొదట గళమెత్తింది జనసేన పార్టీ అని పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖ స్టీల్ కోసం జనసేన చేసిన పోరాటమే కేంద్రాన్ని స్పందించేలా చేసిందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2024-25లో రూ.8,622 కోట్లు, 2025–26లో రూ.3,295 కోట్లు విడుదల చేస్తూ, ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు
మూడు రోజులపాటు జరిగిన జనసేన కార్యక్రమాల్లో భాగంగా శనివారం నాడు బహిరంగ సభ నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన సహాయం అతి ముఖ్యమైన విషయం. 2024-25లో పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12,157 కోట్లు, 2025-26లో రూ5,936 కోట్లు విడుదల చేయగా, ప్రాజెక్టు నిర్మాణంలో ఇది కీలకంగా మారింది. మరోవైపు కూటమి ప్రభుత్వం "దీపం 2" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. దీని కోసం ఐదేళ్లలో ₹13,422 కోట్లు ఖర్చు అవుతాయి.
ఏపీలో సంక్షేమ పథకాలు, గిన్నిస్ రికార్డులు
ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన స్త్రీశక్తి పథకం కింద, మహిళలకు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ₹2,000 కోట్లు ఖర్చుచేస్తోంది. ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఒకేరోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం రికార్డుగా నిలిచింది. గ్రామాల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే "పల్లె పండుగ" కార్యక్రమంలో 4,000 కిలోమీటర్ల రోడ్లు, 22,500 గోకులాలు, 1.5 లక్షల నీటితొట్టెలు నిర్మించారు.
ఉపాధి శ్రామికుల కోసం రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ప్రమాద బీమాను అందించగా, అడవితల్లి బాట పథకం ద్వారా రూ.1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల రోడ్లు వేశాం. జల్ జీవన్ మిషన్ కింద రూ.7,910 కోట్లతో 5 కొత్త ప్రాజెక్టులను అమలు చేస్తూ, 1.2 కోట్ల మందికి వచ్చే 30 ఏళ్లపాటు తాగునీటి కొరత లేకుండా చేయగలిగాం.
ఈ అన్ని అంశాల వెనుక దేశం గురించి ఆలోచించే, సిద్ధాంతాలపై నమ్మకముంచే రాజకీయ దృష్టికోణమే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి గట్టి అడుగులు వేయాలంటే 15 సంవత్సరాల పాటు సుస్థిర పాలన అవసరమని, గత ప్రభుత్వాల అవ్యవస్థలు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ దసరా నుంచి దేశం కోసం పోరాడే కొత్త జనసేన సైన్యాన్ని సిద్ధం చేయాలని’ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.