Janasena Meeting In Vizag | విశాఖపట్నం: నిస్వార్ధంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, భవిష్యత్తులో బలమైన నాయకత్వం అందించడానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత అందించడానికి ‘త్రిశూల్ వ్యూహం’ రూపొందిస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యూహం దసరా నుంచి అమలు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహం ద్వారా జనసేన పార్టీకి ఒక కొత్త అధ్యాయం మొదలు అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మూడు రోజుల పార్టీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా ఉండే సంకేతం పరమశివుడి త్రిశూలం. అదే తీరుగా ఈ వ్యూహంతో ప్రతి క్రియాశీలక కార్యకర్తకు జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత ఇవ్వనున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలకు మరింత సన్నద్ధత చెందేందుకు, పార్టీ పటిష్టత కోసం ఒక నూతన శక్తిని, నియమాలను అనుసరించి నాయకత్వం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.
పార్టీ క్రియాశీల కార్యకర్తల కోసం ప్రత్యేక వ్యూహంఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు, "సర్వ స్ధాయిల నుండి, గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. ప్రతి క్రియాశీల కార్యకర్త ప్రత్యేక మెంబర్‌షిప్ ఐడీతో పటిష్టమైన వ్యవస్థలో భాగస్వామ్యమవుతారు. నాయకత్వం పదవి కాదు, అది సేవ ద్వారా, పోరాటంతో సంపాదించే గౌరవం." క్రియాశీల కార్యకర్తలను, సరిగా శిక్షణ ఇచ్చి సేవా భావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారు" అని అన్నారు.
దేశ రాజకీయ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని విధంగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయాన్ని సాధించాం. 2014లో కేవలం 150 మంది కార్యకర్తలతో ప్రారంభమైన జనసేన యాత్ర, ఇవాళ 12 లక్షల పైచిలుకు క్రియాశీల కార్యకర్తల బలానికి చేరింది. పార్టీ ఆలోచనలపై నమ్మకం ఉంచి దశాబ్దకాలం పాటు నడిచిన జన సైనికులు, వీర మహిళలే నిజమైన హీరోలు. వాళ్ల నిబద్ధత, పోరాటం వలనే 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో అపూర్వ విజయాన్ని అందుకోగలిగాం - పవన్ కళ్యాణ్
నమ్మకంతో పాటు మార్పు అవసరంప్రజల ఆకాంక్షలకు సమాధానం ఇచ్చే విధంగా కొత్త నాయకులను తయారు చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిబిరాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం లేదా రంగు వంటి అంశాల ఆధారంగా లబ్ధి పొందే పరిస్థితులు ఉండకూడదు. కులం కోసం ప్రయాణం సాగిస్తే కుల నాయకుడిగా మాత్రమే పరిమితమవుతాను. నేను జాషువా విశ్వనరుడు స్ఫూర్తితో, సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మహిళా కార్యకర్తలు, యువ నాయకత్వంసమాజంలో మహిళా కార్యకర్తలకు మరింత శక్తి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఆడపడుచులకు 33 శాతం రిజర్వేషన్, సామర్థ్యం ఉన్న మహిళలను స్వతంత్రంగా ఆలోచించే నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ప్రజల సంక్షేమం, రోడ్లు, నీటి సరఫరా2024 నాటికి జనసేన పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని, అలాగే 2024 ఎన్నికలలో 100 శాతం విజయాన్ని సాధించడానికి పార్టీలో ఉన్న అందరి సహకారం అవసరం అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను నిరసించి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు, ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకురావడంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భవిష్యత్తు మార్పును, చైతన్యాన్ని ప్రజల్లో నింపాలని, దసరా నుంచి ఒక నూతన సేనను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
"జనసేన పార్టీ, ప్రజల సమసమాజ ప్రయోజనాలు కోసమే పయనిస్తున్నది. జాతీయ స్థాయికి చేరుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు, మహిళా కార్యకర్త అందరూ తమ విధిలో శక్తివంతంగా పని చేస్తే, ఈ ఉద్యమం విజయం సాధించవచ్చు" అని పవన్ కళ్యాణ్ అన్నారు.