Coromandel Express Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంతో పాటు ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. శుక్రవారం రాత్రి జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 800కు పైగా బాధితులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ తమకు కావాల్సిన విధంగా సీట్లు రాలేదని, టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న ఓ కొత్త జంట విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. రెగ్యూలర్ గా తన మాట మీదనే ఉండేవాడు. కానీ లక్కీగా ఆరోజు భార్య మాట వినడంతో తామిద్దరం ప్రాణాలతో ఉన్నామని చెబుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి..
పక్క పక్కన సీట్లు రాలేదని టికెట్ క్యాన్సిల్..
నవ దంపతులు దుర్గా ప్రసాద్, లిప్సి ఒడిశాలోని బాలసోర్ కి చెందిన వారు. అక్క ఇంటికి చుట్టపు చూపుగా వైజాగ్ రావడానికి వీళ్లు మొదట హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏసీ కోచ్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ తమకు పక్క పక్కన సీట్లు రాలేదని జూన్ 2న బయలుదేరే రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. అదే వారిని కాపాడిందని చెప్పవచ్చు. అంతకుముందు రోజు వెళ్లే రైలులో టికెట్లు బుక్ చేసుకుని విశాఖకు వచ్చారు దుర్గా ప్రసాద్, లప్సి దంపతులు. మరుసటి రోజు టీవీలో రైలు ప్రమాదం జరిగిన ఘటన గురించి చూసి కొత్త జంట షాకైంది. ఒకవేళ ముందుగా బుక్ చేసుకున్నట్లుగా కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసింటే తమ పరిస్థితి ఎలా ఉండేదోనని ఊహించుకుంటేనే భయమేస్తుంది అంటోంది కొత్త జంట. పూరి జగన్నాథుడే తమను కాపాడాడు అంటున్నారు దుర్గా ప్రసాద్ దంపతులు. దేవుడి ఆశీస్సులు తమకు ఉన్నాయని, లేకపోతే తమ పరిస్థితి ఇలా ఉండకపోయేదని చెబుతున్నారు. ఏది ఏమైతేనేం రైలు ప్రమాదం ఘటనలో ఒక్కో మనిషిని కదిలిస్తే ఒక్కో కొత్త విషయం బయటకొస్తోంది.
దుర్గా ప్రసాద్ దంపతులు ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు రిజర్వేషన్ చేసుకున్నాం. కానీ సీట్లు పక్కపక్కన రాలేదు. దాంతో టికెట్లు క్యాన్సిల్ చేద్దామని భార్య చెప్పగా, క్యాన్సిల్ చేశాడు. తమ ప్రయాణాన్ని ఒకరోజు ముందుకు జరుపుకుని, జూన్ 1న వచ్చినట్లు తెలిపాడు. తాము విశాఖకు వచ్చిన మరుసటి రోజు రాత్రి టీవీలో ఒడిశాలో ఏదో రైలు ప్రమాదం జరిగిందని చూశాను, కానీ ఉదయం లేచి చూస్తేగానీ అది ఎంత పెద్ద రైలు ప్రమాదమే తనకు అర్థం కాలేదన్నాడు దుర్గా ప్రసాద్. తాము చాలా లక్కీ అని, దేవుడి దయ వల్ల ప్రాణాలతో ఉన్నామన్నాడు. ఒడిశాకు చెందిన వ్యక్తి అయినా వైజాగ్ లో కొన్నేళ్లపాటు జాబ్ చేయడంతో తనకు తెలుగు బాగా వచ్చు అని చెప్పాడు. గతంలో జాజ్ పూర్ లో రైలు ప్రమాదం జరిగిందని, కానీ గూడ్స్ రైలు కావడంతో పెద్ద నష్టం జరగలేదన్నాడు దుర్గా ప్రసాద్. తమ విషయంలో ఇరు కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.