కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులో రావలసిన ఏపీ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన స్థలం నుంచి ప్రత్యేక రైలు ఏపీకి బయలుదేరినట్లు అధికారులు చెబుతున్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి చెందిన ప్రయాణికులు 178 మంది ఉండగా.. ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్న కొంతమంది ప్రయాణికులను స్వస్థలానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడింది. బాలాసోర్ నుంచి ఏపీ ప్రయాణికులతో బయలుదేరిన ప్రత్యేక రైలు శనివారం రాత్రి 9:30 గంటలకు విజయవాడ చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన రెండు కుటుంబాలకు చెందిన వారు శనివారం మధ్యాహ్నం వైజాగ్ చేరుకున్నారు.
రాత్రి జరిగిన ఘటన ఘటన తలుచుకుంటూ ప్రయాణికులు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. కొందరైతే వారి బంధువులు, స్నేహితుల జాడ తెలియక సతమతమవుతున్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోరమాండర్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 178 కాగా... అయితే ఇందులో ఫస్ట్ క్లాస్ ఏసీలో తొమ్మిది మంది, సెకండ్ క్లాస్ ఏసీలో 17 మంది, థర్డ్ ఏసీలో 114 మంది, స్లీపర్ క్లాస్ లో 38 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఏపీవాసులు ఎందరున్నారో తేలాల్సివుందని వాల్తేరు డీఆర్ఎం చెప్పారు.
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని సొంత రాష్ట్రాలకు పంపేందుకు వీలుగా ఉదయం భద్రక్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది.
రాజమండ్రికి చెందిన 21 మంది సేఫ్.. మరో ముగ్గురి కోసం గాలింపు
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రోజు ఘోర రైలు ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ ఘటనలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ రైలులో రాజమండ్రికి వచ్చేందుకు 24 మంది ప్రయాణికులు రైలు ఎక్కినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో 21 మంది సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆ రైలులో రాజమహేంద్రవరానికి చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే.. వారి బంధువులు స్థానిక రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ నంబర్లు 08832420541, 08832420543కు సంప్రదించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. దీంతో రాజమహేంద్రవరం స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్ అంతా రద్దీగా మారింది. చాలా మంది రైళ్ల కోసం అక్కడే వేచి చూస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఓ బృందాన్ని ప్రమాద ఘటన ప్రాంతానికి పంపించారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు బయల్దేరి వెళ్లింది. ఈ బృందంలో ముగ్గురు ఐఏఎస్‌లు ఉన్నారు. అమర్ వెంట సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ ఉన్నారు.