Former Minister Konatala Ramakrishna: దివంగత నందమూరి తారక రామారావు తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని, రామారావు గారికి తాను అతిపెద్ద అభిమానినని మాజీ మంత్రి, అనకాపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడున్న ఎన్టీఆర్ చిత్రపటాలను చూస్తుంటే తనకు గత స్మృతులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వదగిన వ్యక్తి అని కొణతాల కొనియాడారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తీసుకువచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దక్కుతుందని కొణతాల పేర్కొన్నారు.


తెలుగుజాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అని, దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని కొణతాల పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాడు అంటే దానికి కారణం ఎన్టీఆర్ అని కొణతాల గుర్తు చేశారు. తెలుగు బిడ్డ ప్రధాన కావాలన్న ఆకాంక్షతో ఆయనపై పోటీ పెట్టకూడదని ఎన్టీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా కొణతాల గుర్తు చేశారు. అప్పట్లో ప్రధాన పక్షాలుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖాలు చూసుకునే పరిస్థితి కూడా లేదని, ఒక పార్టీ నేతలు శుభకార్యాలకు మరో పార్టీ నేతలు కూడా వెళ్లేవారు కాదని, అటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ పీవీ నరసింహారావుపై పోటీ పెట్టకుండా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని రామకృష్ణ కార్యకర్తలకు తెలియజేశారు. 


కృష్ణార్జునలుగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ - చంద్రబాబుకు మద్దతు తెలపాలి


రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులుగా పని చేస్తున్నారని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వేరు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఈరు పార్టీల కార్యకర్తలకు ఆయన సూచించారు. తనకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని కోరిన కొణతాల.. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు సమన్వయంతో పని చేస్తే విజయం సాధించడం సులభం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి ఓటేయాలని ఆయన సూచించారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కొణతాల స్పష్టం చేశారు.