విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకున్నాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. దాడి చేసిన వాళ్లను వదిలి పెట్టే సమస్య లేదంటున్నారు మంత్రులు 


విశాఖ గర్జన ముగించుకొని మంత్రి జోగి రమేష్‌, రోజా, ఇతర వైసీపీ లీడర్లు వెళ్తున్న టైంలో జన సైనికులు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో లీడర్ల కార్ల అద్దాలు ధ్వంసం చేశారని చెబుతోంది. దీనికి పూర్తి బాధ్యత పవన్ కల్యాణ్‌దేనంటున్న వైసీపీ... సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 


మంత్రులపై జరిగిన దాడి అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆ దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదన్నారు. విమర్శ, ప్రతివిమర్శతోనే ఏ వివాదమైనా సద్దుమణిగిపోవాలి కానీ ఇలాంటి దాడులు సరికావు అని అభిప్రాయపడ్డారు. 


ఉత్తరాంధ్ర ఆకాంక్ష వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించడమేనన్నారు స్పీకర్ తమ్మినేని. అలాంటి కోరికతో పెద్ద ఎత్తున సభ జరిగితే..దానిని వ్యతిరేకంగా జరిగిన దాడిగా ఈ ఘటనను చూస్తున్నామన్నారాయన. మంత్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి దాడులు చేస్తే..మరింత తీవ్రంగా ప్రతి దాడి జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే అందరూ సంయమనం పాటించాలని కోరారు. 


మంత్రులపై దాడి చేసిన వారు జనసైనికులు కాదని... జన సైకోలని అభిప్రాయపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఈ దాడులకు పూర్తిగా పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా దాడి చెయ్యాలని పవనే తన శ్రేణులకు చెప్పి ఉంటారని ఆరోపించారు. నాయకుడి మైండ్ సెట్టే కేడర్‌కి కూడా ఉంటుందని తెలిపారు. పవన్ కల్యాణ్‌ తమ నాయకుల కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా క్షమించే పరిస్థితి లేదన్నారు. మంత్రుల సిబ్బందిలో ఒకరిని తల పగులకొట్టీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి చేసిన వారిని వదిలే ప్రశక్తి లేదన్నారాయన. 


మరో మంత్రి అంబటి రాంబాబు... ట్విట్టర్ వేదికగా పవన్‌ను ప్రశ్నించారు. ఇలా మంత్రులపై వైసీపీ లీడర్లపై దాడులు చేయడంపై పవన్ ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు.