Minister Gudivada Amarnath: ఏపీలోని విశాఖపట్నంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని మంత్రి గుడివాడ్ అమర్నాథ్ తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాలోని అచ్చుతారపురంలో కూడా ఎకరా స్థలం అమ్మి.. తెలంగాణలో 150 ఎకరాలు కొనుగోలు చేయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో అలా మాట్లాడారో, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకే ఉద్దేశ్యంతో ఇలా చెప్పారో తనకు తెలియదన్నారు. కానీ ఏపీలో మాత్రం భూముల ధరలు చాలా ఎక్కువే అని వివరించారు. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాయన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే పక్క రాష్ట్రాలను సీఎం కేసీఆర్ కించపరుస్తున్నారని ఆరోపించారు. 


సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?


తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని ఇటీవల చంద్రబాబు ఓ రోడ్ షోలో అన్నారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదుల సంఖ్యలో ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించారు. తాజాగా చంద్రబాబు మాటలను పటాన్ చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial