Minister Gudivada: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన విషయంపై అనేక పేపర్లు, ఛానెళ్లలో వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదో తెలియదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  తనతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ బాబు సమాధానం కోసం వేచి చూస్తున్నారని అన్నారు. అలాగే చంద్రబాబు చరిత్రే ఓ చీకటి చరిత్ర అంటూ విమర్శించారు. దీని గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి తీరు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుందంటూ చెప్పుకొచ్చారు.


చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోటులతో సాగిందంటూ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వాళ్లు ఎవరూ ఉండరంటూ కామెంట్లు చేశారు. ఈసారి నేరుగా ఐటీ శాఖనే చంద్రబాబు ప్రజలను మోసం చేశాడంటూ, పెద్ద ఎత్తున స్కాం చేసి కోట్లలో డబ్బులు కొట్టేశాడని నోటీసులు జారీ చేస్తే... ఆయన స్పందించక పోవడం దారుణం అన్నారు. కనీసం తాను ఇది చేయలేదని కూడా అనట్లేదంటేనే.. ఆయన తప్పు చేసినట్లు అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. 


మొత్తం 118 కోట్ల స్కాం, 46 పేజీలతో నోటీసులు జారీ


తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. ఈ ఒక్క స్కాం ద్వారా చంద్రబాబు చేసిన అనేక స్కాంలు బయట పడతాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. వీటి నుంచి ఆయన తప్పించుకోలేరంటూ కామెంట్లు చేశారు. 118 కోట్ల స్కాం చేశారంటూ ఐటీ శాఖ మొత్తం 46 పేజీలతో ఆగస్టు 4వ తేదీన నోటీసులు జారీ చేసిందని వివరించారు. అలాగే వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా చంద్రబాబు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసుకు నాలుగు లేఖరు రాశారని అన్నారు. వాళ్లు నోటీసులు ఇస్తే ఈయన స్పందించి మాట్లాడాల్సింది పోయి ఈ లేఖలు రాయడం ఏటంటూ ప్రశ్నించారు. "నా పేరు మీకెవరు చెప్పారు, మీరెవరు అసలు నాకు నోటీసులు ఇవ్వడానికి" అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్న విషయాలు చూస్తుంటే తనకు ఛాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు లేఖల ద్వారా అడిగిన అన్ని ప్రశ్నలకు ఐటీ అధికారులు సమాధానం చెప్పారని వివరించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు అస్సలే తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 


డబ్బు మొత్తాన్ని రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకు తీసుకొస్తాం


అలాగే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కిల్డ్ క్రిమినల్ అని, అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్కాంల ద్వారా చంద్రబాబు దోచేసిన డబ్బు మొత్తాన్ని రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకు తీసుకొస్తామని వివరించారు. అలాగే ఈ కేసులో బాబుకు సహకరించిన ఆయన కుమారుడు నారా లోకేష్ పేరు కూడా నోటీసుల్లో ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో చంద్రబాబు డబ్బును దోచేశారని ఆరోపించారు. అలాగే ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఈ కేడీని పట్టుకోవాలి అనేదే వైఎస్సార్సీపీ డిమాండ్ అంటూ పేర్కొన్నారు.