Srikakulam Weather Update: వరుస తుపాన్లు శ్రీకాకుళం జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే తుపాన్లతో జిల్లా చాలా నష్టాలపాలైంది. ఇప్పుడు మరో తుపాను వారిని భయపెడుతోంది. "దానా' రూపంలో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. "దానా" ప్రభావంతో రేపటి నుంచి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. సముద్ర, నదీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అప్రమత్తంగా ఉండండి..
జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని కాజ్‌వేలు, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు, వాహన చోదకులను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెం:08942-240557 ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సహాయం చేస్తారని తెలిపారు.
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు కలెక్టర్. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు, కరకట్టలు, కాలువల పై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపు నకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
లైఫ్ బోట్లు, కూలిన చెట్లను తొలగించే యంత్రాలు, కొత్త స్తంభాలు సిద్ధంగా ఉంచుకోవాలని, తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేయాలన్నారు. మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు ఎవరూ వారి పని చేస్తున్న కేంద్రాలను విడిచి వెళ్ళొద్దని సెలవులు పెట్టొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఒడిశాతో సమన్వయం అవసరం...
జిల్లాలో ప్రవహిస్తున్న నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా నదుల్లో ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గంజాం, గజపతి జిల్లాల అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పారు
ప్రత్యేక అధికారుల నియామకం...
ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలు జారీ చేశారు. వీరితోపాటు జిల్లాలోని 30 మండలాల్లో తహశీల్దార్లను వారి వారి మండలాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మండలాలైన రణస్థలానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, పి.కిరణ్ కుమార్ (ఫోన్ :8008803800), ఎచ్చర్లకు డ్వామా పీడీ, (8790008399), గారకు ఐసిడిఎస్ పీడి, బి.శాంతి శ్రీ (9440814582), పొలాకికి జిల్లా పరిషత్ సీఈవో, శ్రీధర్ రాజు రామన్ (9100997770), వజ్రపు కొత్తూరుకు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, పివి. శ్రీనివాసరావు (9440716028), సోంపేటకు కార్మిక శాఖ సహాయ కమిషనర్, అజయ్ కార్తికేయ (9492555034), పలాస సహాయ సంచాలకులు, పి చంద్రశేఖర్ (9492416700), కవిటికి ఉద్యాన శాఖాధికారి ఆర్వివి ప్రసాద్ (7995086758), ఇచ్చాపురం మండలానికి డ్వామా ఏపిడి సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి (6309998070) అధికారులుగా నియమించామని కలెక్టర్ చెప్పారు.
గతంలో ఏర్పడిన హుద్‌హుద్, తితిలి తుపాన్ల పరిహారం ఇంకా అందలేదు మరో తుపాన్ అనే పేరు చెప్పేసరికి భయప్రాంతం గురవుతున్నామంటున్నారు ప్రజలు. ఒడిశాలో తీరం దాటుతుందని చెబుతున్నప్పటికీ ఉద్దానంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని భయపడిపోతున్నారు.
Also Read: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు