Cyclone Dana News Updates | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడింది. ఈ వాయుగుండం పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ దూరములో సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) ఆగ్నేయంగా 750 కి.మీ దూరములో, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 730 కి.మీ దూరంలో దక్షిణ- ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. బలపడిన వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు (అక్టోబర్ 23న) తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 


ఆ తర్వాత తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడనుంది. అక్టోబర్ 24న రాత్రి లేకపోతే అక్టోబర్ 25న ఉదయంగానీ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరమైన పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరము దాటే సమయములో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. గరిష్టంగా 120 కిలోమీటర్లు వేగంతో సైతం గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఒక అల్పపీడన ద్రోణి ఎగువ వాయుగుండము నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దానా తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.






దానా తుఫాను ప్రభావంతో ఏపీలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బుధవారం నుంచి మూడు రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంట గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కనుక అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  


తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ 


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు దానా తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి మవనగిరి, వరంగల్, హనుముకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్ష సూచనతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.






ఉక్కపోతతో ఇబ్బంది పడిన హైదరాబాద్ వాసులకు ఊరట లభించింది. మంగళవారం కురిసిన వర్షానికి పగటి ఉష్ణోగ్రత కాస్త తగ్గి, ఎండలు, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేక మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదు కానుంది. తూర్పు, ఈశాన్య దిశలలో గంటలకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.