టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా స్పందించారు. చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశారని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అని అన్నారు. చంద్రబాబు గతంలో తన శిష్యుడని ఆయన గురించి తనకు బాగా తెలుసని కేఏ పాల్  అన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే కనీసం 600 మంది కూడా రోడ్ల మీదకి రాలేదని, 150 మందిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. టీడీపీలో 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని అన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలు అందరికి తెలుసని పాల్ అన్నారు. విశాఖపట్నంలో మంగళవారం (సెప్టెంబరు 12) కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు అని పేర్కొన్నారు. బీజేపీ వల్ల దేశం సర్వనాశనం అయిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, అమిత్ షాను కలవనున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, చాలా మంది వైఎస్ఆర్ సీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. 


జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ.. ఆయన తెలివైన వాడని కేఏ పాల్ అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.