జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఈనెల 15న ఉత్తారంధ్రలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతా జనసేన లీడర్లు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 16వ తేదీని విశాఖ పట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయా జిల్లాల నుంచి ప్రజాసమస్యలపై వచ్చే వినతి పత్రాలు స్వీకరిస్తారు. 15, 16, 17 తేదీల్లో విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులతో మాట్లాడతారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. 






ఆదివారం వరుస ట్వీట్లతో ప్రభుత్వంతో తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. ఉత్తారంధ్ర వైసీపీ లీడర్లు రాజీనామాలపై చేస్తున్న ప్రకటలపై విరుచుకుపడ్డారు. వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎందుకోసం వైసీపీ గర్జనలు అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడకుండా, మాట మార్చినందుకు గర్జనలు చేస్తున్నారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  


ఏం చేశారని గర్జనలు.. పవన్ ఫైర్
‘‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?. 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా.. లేకపోతే ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా. కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?’ దేని కోసం గర్జనలు అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ తన ట్విట్లలో ప్రశ్నించారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా? కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా? ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా? స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణ వరకూ పార్టీ రంగులు వేసుకొంటున్నందుకా? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా? భర్తీ చేస్తామన్న 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? పోలీసు రిక్రూట్మెంట్ చేయనందుకా? డిఎస్సీ ఊసు వదిలేసినందుకా? వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా? గ్రామ పంచాయతీల నిధులు మళ్లించేసినందుకా? మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని అడిగిన సర్పంచులను అరెస్టులు చేస్తున్నందుకా? శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నందుకా? మడ అడవులు ధ్వంసం చేసేస్తున్నందుకా? కాలుష్యకారక పరిశ్రమలు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ముద్దులుపెట్టి... ఇప్పుడు ఆ పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నందుకా? అంటూ ప్రశ్న వర్షం కురిపించారు. 


పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రులు, వైసీపీ లీడర్లు


ఈ ట్వీట్లపై మంత్రులు వరుస ప్రెస్‌మీట్లు పెట్టారు పవన్‌పై తీవ్రంగా విమర్సలు చేశారు.. పవన్ ట్వీట్లతో ప్రజలతో ఉన్నాను అనే భ్రమలో ఉన్నారని మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ ఎద్దేవా చేశారు.  షూటింగ్ గ్యాప్ లో  ట్వీట్ లు చేయ‌టం ప‌వ‌న్ కు అల‌వాట‌ని వ్యాఖ్యానించారు. అంతే కాదు పవన్ కు రాజకీయ విలువలు లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని, మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు సత్యనారాణ ఆవేద‌న వ్యక్తం చేశారు. 


పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా అంటూ విమర్శలు చేశారు. పవన్‌ ఉండేది హైదరాబాద్‌లో షూటింగ్స్‌ విదేశాల్లో ఏపీలో పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు.  చంద్రబాబు ఏం చెబితే అది పవన్ ట్వీట్ చేస్తారని ఆరోపించారు. పవన్‌ ట్వీట్లు కూడా సినిమా డైలాగుల్లానే ఉంటాయన్నారు. 2024లో జనసేనను చంద్రబాబుకు అమ్మేడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ట్విట్టర్‌లో కాదు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే విజయవాడ రావాలని సవాల్ విసిరారు. పవన్‌ను ప్రశ్నించిన ప్రతి అంశంపై తాను చర్చకు సిద్ధమని మంత్రి జోగి రమేష్ అన్నారు. 


ఏపీలో మూడు రాజధానులు, అందుకు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న నిర్వహించబోయే విశాఖ గర్జన భారీ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వేళ, ఏపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ కల్యాణ్ పై వరుస ట్వీట్లు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడి పవన్ కల్యాణ్ మియావ్ మియావ్...!’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘మియావ్.. మియావ్ దత్తపుత్రుడి పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ః 1 - అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2 - జాతీయ రాజధాని ముంబాయి, 3 - పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్’’ అంటూ ఎద్దేవా చేశారు.