GVL Narasimha Rao: ప్రజాపోరు యాత్రలో ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ గట్టిగా మాట్లాడిందని ఎంపీ జీవియల్ నరసింహారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తే టీడీపీ, వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపలేకపోయారని ప్రశ్నించారు. 2024 వరకు హైదరాబాద్‌లో హక్కు ఇస్తే ఎందుకు వదిలేశారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు సచివాలయంలో భవనాలు ఇచ్చేశారని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో పోటీ చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఏపీ ప్రజలు ఇంకా రాష్ట్ర విభజన బాధలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
విశాఖ అభివృద్ధిలో వైసీపీ పాత్ర ఏంటి..?
భూదందాలు, భూములను కొట్టేయడం తప్ప.. రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ఏం చేసిందని అన్నారు. వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ భూసేకరణ కూడా చెయ్యలేక పోయారని విమర్శించారు. ఈ కారిడార్ వస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని తెలపారు. రాజీనామాలు చేస్తాం అని చెప్పిన వారు... విశాఖ అభివృద్ధి మీద చేసిన అభివృద్ధి ఏమిటో టీడీపీ, వైసీపీలు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో సొంత పార్టీని చూసుకోవడం మానేసి.. బీజేపీపై దృష్టి పెడుతూ.. రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
"బస్సు లోపల కూడా గొడుగు పట్టుకొని కూర్చోవాల్సిందే"
రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాగోలేదని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. చివరికి ఆర్టీసీ బస్సు లోపల కూర్చున్న ప్రయాణికులు కూడా గొడుగు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. అందుకేనా 175కి 175 సీట్లు కావాలని అడుగుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హిట్లర్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ స్ఫూర్తి పొందుతునట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఇక్కడ బట్టన్ నొక్కడం కాదు... కేంద్రం నుంచి బట్టన్ నొక్కితే జగన్ పని అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాయకులు రాజీనామా నాటకాలు ఆపాలని అన్నారు.
చంద్రబాబు హైదరాబాద్‌లో, జగన్ తాడేపల్లిలో..
అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు హైదరాబాద్‌లోనే కూర్చున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జగన్ అమరావతిలో ఉంటానని తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎందుకు మూడు రాజధానులు ఊసు ఎత్తలేదో చెప్పాలన్నారు. చైనా రాజధాని బీజింగ్ అయినప్పటికీ... షాంఘైని అభివృద్ధి చేస్తున్నారని... అలాగే విశాఖను అభివృద్ధి చేయచ్చు కదా అని చెప్పారు. రాయలసీమ వెనుక పడిందని... ఆ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిందని సోము వీర్రాజు తెలిపారు. దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఒక రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.