ఏపీలో మూడు రాజధానులు, అందుకు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న నిర్వహించబోయే విశాఖ గర్జన భారీ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వేళ, ఏపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.


ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ కల్యాణ్ పై వరుస ట్వీట్లు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడి పవన్ కల్యాణ్ మియావ్ మియావ్...!’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘మియావ్.. మియావ్ దత్తపుత్రుడి పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ః 1 - అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2 - జాతీయ రాజధాని ముంబాయి, 3 - పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్’’ అంటూ ఎద్దేవా చేశారు.










అంతకుముందు పవన్ కల్యాణ్ మూడు రాజధానులు, విశాఖ గర్జన సభలను ఉద్దేశిస్తూ ఘాటుగా వరుస ట్వీట్లు చేశారు. దేనికి గర్జనలు అంటూ ప్రశ్నించారు. ‘‘దేనికి గర్జనలు? ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?’’ అంటూ ప్రశ్నించారు.


‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?’’ అంటూ మరో ట్వీట్ చేశారు.














రెండూ రెండే - సోము వీర్రాజు


ఏపీ రాజధాని విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా స్పందించారు. వైఎస్ఆర్ సీపీ, టీడీపీ అధినేతలపై విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు.. నాగరాజు, సర్పరాజు లాంటివని, వైసీపీ రూలింగ్ పార్టీ కాదని, ట్రేడింగ్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై చంద్రబాబు, జగన్‌కు ఇద్దరికీ శ్రద్ధ లేదని అన్నారు. రాజధాని అంటే భూముల దందా, దసపల్లా, వాల్తేర్ క్లబ్ భూములు దందా అంటూ దుయ్యబట్టారు. ఈ 8 ఏళ్లలో రెండు ప్రభుత్వాలు ఏపీకి ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో భూ దందా తప్పితే అభివృద్ధి ఏం చేశారని నిలదీశారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొట్టాలని ఘాటుగా వ్యాఖ్య చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో ఏం చేశారో చెప్పాలని అన్నారు. దసపల్లా భూములపై ఇండిపెండెంట్ కమిటీ వేసి వారి అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రభుత్వానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.