International Golf Tournament: వైజాగ్ లోని గోల్ఫ్ క్లబ్ లో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించ బోతున్నట్లు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్, కార్యదర్శి  ఎం.ఎస్.ఎన్ రాజు తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ సాగుతుందన్నారు. అలాగే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ 1984లో ఈస్ట్ పాయింట్ కోలనీ ( ఉడా పార్క్) దగ్గర స్థాపించారని గుర్తు చేశారు. ముడసర్లోవ వద్ద గల క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.


భారత దేశంలో ఇది రెండో గోల్ఫ్ క్లబ్ అని గుర్తు చేశారు. 1964లో ముడసర్లోవ గ్రామంలో ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించిందని.. ఫిబ్రవరి 2021లో ఛాంపియన్షిప్ గోల్ఫ్ క్లబ్ గా ప్రపంచ ప్రమాణాలతో భవనం నిర్మించినట్లు తెలిపారు. అలాగే జీఏ సదస్సు నుంచి గతేడాదే ఉత్తమ పునర్నిర్మాణ గోల్ఫ్‌  కోర్సు అవార్డును అందుకుంది. ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం దాతలు, క్లబ్ సభ్యులు , ప్రభుత్వ అధికారుల నుంచి లభించిన మద్దతు వల్లే అని గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి తెలిపారు. వీరందరికీ ఎంఎస్ఎన్ రాజు ధన్యవాదాలు చెప్పారు.


సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 23 వరకు సాగనున్న టోర్నమెంట్


విశాఖ చరిత్రలో మొట్టమొదటి సారిగా  పీజీటీఐ టోర్నమెంట్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు  నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మొత్తం 126 మంది ఉత్తమ గోల్ఫ్ ఆటగాళ్లు పాల్గొంటారని చెప్పారు. భారతదేశంతోపాటు ఆరు ప్రపంచ దేశాలు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా ఆటగాళ్లు పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. ఈ అధికారిక ప్రపంచ గోల్ఫ్ ఆటలో వచ్చిన ర్యాంకింగ్ పాయింట్స్.. వారు పాల్గొనే ఒలంపిక్స్, ప్రపంచ ఈవెంట్స్‌లో అర్హత సాధించేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ టోర్నమెంట్ యూరో స్పోర్ట్స్, సోషల్ మీడియా స్ట్రీమింగ్ ఏబీపీ న్యూస్, దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుందని వివరించారు. 


టోర్నమెంట్ వల్ల విశాఖకు పేరు ప్రఖ్యాతలు


ఈ టోర్నమెంట్ గోల్ఫ్ ప్రమాణాలు, ఆతిథ్యం, పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తూ.. దేశంలో ఉన్న పారిశ్రామిక సంస్థలను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఆర్ధిక, పారిశ్రామిక , సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతోందని అన్నారు. ఈ టోర్నమెంట్ వల్ల ఇండియాలో విశాఖపట్నం గోల్ఫ్ ఆటకి ఒక గమ్య స్థానం అవుతుందని చెప్పారు.


టోర్నమెంట్ విజయవంతమైన తరువాత గోల్ఫ్ క్లబ్ కు ప్రపంచ గోల్ఫ్ పటములో ఒక స్థిరమైన, కచ్చితమైన స్థానం లభిస్తుందని.. అంతేకాకుండా విశాఖపట్నం నగరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఎంఎస్ఎన్ రాజు చెప్పారు. ఈ సమావేశంలో టాటా స్టీల్ మార్కెటింగ్ - టూర్ విభాగం, హెడ్, వికాస్ సింగ్, కోశాధికారి పి.రామకృష్ణా రావు, సభ్యులు పి వీ ఎల్ ఎన్ రాజు, టి కే రాజు, ఎస్ వీ హెచ్ రాజేంద్ర, డి టి రాజు, జీ.విజయ్ కుమార్, డి. కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Read Also: Chandra Babu on Jagan: కేసులపై చంద్రబాబు కౌంటర్- సాగునీటి విధ్వంసంపై సమాధానాలని సవాల్