Visakha News: జీ-20 సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. జీ-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విశాఖపట్నంలో సదస్సు నిర్వహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. జీ-20 సదస్సులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200 వరకు సదస్సులు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 


విశాఖ వేదికగా..


2023 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, అలాగే ఏప్రిల్ 24వ తేదీన విశాఖపట్నంలో వివిధ అంశాలపై సదస్సు నిర్వహించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. జీ-20 సదస్సుకు నోడల్ అధికారిగా ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డీజీపీని నియమించారు. విశాఖపట్నంలో జీ-20 సదస్సు మూడు రోజులు జరగనుంది. ఈ మూడ్రోజుల్లో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, వైద్య, విద్యతో పాటు 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు వెల్లడించారు. 


వేల మంది ప్రతినిధులు హాజరు అవుతారని, వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొంటారని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వ నాథన్, డీఆర్వో శ్రీనివాస మూర్తి ఇతర జిల్లా అధికారులతో సమావేశమైన దిశానిర్దేశం చేస్తున్నారు. జీ-20 సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్ విశ్వ నాథన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. సదస్సుకు వచ్చే అతిథుల కోసం విశాఖపట్నంలోని స్టార్ హోటళ్లలో 703 గదులను రిజర్వ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సదస్సు విశాఖకు వచ్చే వారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలనూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


అసలు జీ-20 సదస్సులో ఏం చేస్తారు?


ప్రపంచంలోని ఆర్థికంగా బలమైన దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు, ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం వాటా ఈ 20 దేశాలదే. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతలు ఈ 20 దేశాల్లోనే ఉంటారు. జీ-20 సదస్సుకు ఒక్కోసారి ఒక్కో దేశం అధ్యక్షత వహించి నిర్వహణ చేపడుతుంది. జీ-20 శిఖరాగ్ర సదస్సును, చిన్న చిన్న సమావేశాలను అధ్యక్షత వహించే దేశమే నిర్వహిస్తుంది. జీ-20 సభ్యత్వం లేని దేశాలను ఈ సదస్సుకు అతిథిగా ఆహ్వానించడానికి, అటువంటి దేశాలను ఎంపిక చేయడానికి ఆతిథ్య దేశానికి వీలుంటుంది. 


తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో చాలా దేశాల మీద ప్రభావం చూపిన వేళ 1999లో మొట్టమొదటి జీ-20 సదస్సు బెర్లిన్ లో జరిగింది. అయితే అప్పటికే జీ-8 ఉండగా... ఆ సమయం నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర దేశాలను కలిపి జీ-20 ని ఏర్పాటు చేశారు. మొదట్లో జీ-20 సదస్సుకు దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరు అయ్యే వారు. 


2008 నాటి ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. బ్యాంకులు కుప్పకూలాయి, నిరుద్యోగం అధికంగా పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయాయి ఈ పరిణామాలతో జీ-20 సంస్థ ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారిపోయింది.