Vizag G20 Summit:

  రాష్ట్ర మంత్రులు కొందరు వైజాగ్ లో మకాం వేశారు . ఈనెల 28, 29తేదీల్లో జరగనున్న జీ 20 సదస్సు ఏర్పాట్లను వారు సమీక్షిస్తున్నారు. దాదాపు 45 దేశాల ప్రతినిథులు హాజరుకానున్న ఈ సదస్సులో వైజాగ్ కల్చర్ ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు వారు చెబుతున్నారు. ఇంఛార్జ్ మంత్రి విడదల రజని, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సహా కీలక అధికారులు అంతా వైజాగ్ లోనే ఈ సదస్సు పూర్తయ్యే వరకూ ఉండబోతున్నారు. సదస్సు నిర్వహణకు కావలసిన  ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసినట్లు  జిల్లా ఇంఛార్జి మంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి విడదల రజని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రులు, అధికారులతో సదస్సు ఏర్పాట్లపై చివరి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన  నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.  


వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నాదని, వారి కి కావలసిన రవాణా, వసతి,  భద్రతా ఏర్పాట్లు  పూర్తి చేసినట్లు తెలిపారు.  సదస్సు  నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా  విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు.  46 కిలోమీటర్ల  బిటి రోడ్డు పనులు, 24 కిలోమీటర్ల పెయింటింగ్ పనులు, పది కిలోమీటర్ల ఫుట్ పాత్ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసినట్లు  తెలిపారు. విశాఖ నగరం దేశంలోనే సుందర నగరంగా నిలుస్తుందని తెలిపారు.  
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సదస్సుకు  జి 20 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కి చెందిన దేశాలు కూడా పాల్గొంటున్నాయని తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్  సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.  ఈ సదస్సుకు విచ్చేసే విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర సమాచారాన్ని పూర్తిగా అందిస్తామని,    పెట్టుబడులకు గల అవకాశాలు గూర్చి తెలియజేస్తామన్నారు.


 ఈ సమావేశంలో స్పెషల్ సి ఎస్  వై. శ్రీలక్ష్మి, ఎంఏడి   డైరెక్టర్ ప్రవీణ్ కుమార్,  జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్  సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్  రాజబాబు, పార్లమెంట్ సభ్యులు  ఎం వి వి సత్యనారాయణ, మేయర్ గొలగాని  హరి వెంకట కుమారి,  శాసనసభ్యులు  అవంతి శ్రీనివాసరావు,  తిప్పల నాగిరెడ్డి  హాజరయ్యారు