Araku Train: అరకు పర్యటన ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఎంతో అలరిస్తుంటాయి. విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పర్యాటక ఆకర్షణ గల ఏరియాలలో అరకు ఒకటి. అరకు లోయ అందాలను చూసిన పర్యాటకులు ఎవరైనా మంచి అనుభూతి పొందుతారు. చలి కాలంలో అరకు అందాలు రెట్టింపు అవుతాయి. మంచు కురుస్తున్న సమయంలో ఆ ప్రకృతి అందాలను చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాహస క్రీడలు, ట్రెక్కింగ్, కేవింగ్, సైట్ సీయింగ్ ఇలా చాలా పర్యాటక హంగులు ఇక్కడ ఉన్నాయి. 


ప్రయాణం మధురం.. 
అరకుకు వెళ్లడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అరకుకు రోడ్డు మార్గం ద్వారా, ట్రైన్ లో రెండు రకాలుగా చేరుకోవచ్చు. ఘాట్ రోడ్డు చాలా బాగుంటుంది. అలాగే ట్రైన్ జర్నీ కూడా అంతే మనోహరంగా ఉంటుంది. డే టైమ్ లో పర్యాటక రైలులో వెళ్తుంటే.. ప్రకృతి అందాలు మైమరిపిస్తుంటాయి. వంతెనలు, సొరంగాల గుండా ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైజాగ్ నుండి కిరండోల్ వరకు రైలు నడుస్తుంది. ఈ రైలు ప్రయాణం అంతా ఎంతో హాయిగా గడుస్తుంది. ఉదయం 6 గంటలకు మంచు దుప్పటిని చీల్చుకుంటూ రైలు బయలు దేరుతుంది. 11  గంటల వరకు అరకు చేరుకుంటుంది. అరకు వెళ్లే రైలులో పర్యాటకులు మరింత ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదించేందుకు 2017 లో విస్తాడోమ్ గా పిలిచే గాజు బోగీలను తీసుకువచ్చింది రైల్వే శాఖ. 




ఒకటి నుండి మూడు తర్వాత అన్ని.. 
2017లో మొదటి విస్తాడోమ్ కోచ్ ఏర్పాటు చేయగా.. నిన్నటి వరకు మూడు గాజు బోగీలు ఉండగా.. తాజాగా ఏర్పాటు చేసిన దాంతో కలిపి వాటి సంఖ్య 4కు చేరింది. ఒక్కో బోగీలో 47 సీట్లు ఉంటాయి. మొత్తం ఏసీ సిట్టింగ్ తో ఉండే ఈ బోగీల్లో చుట్టూ అద్దాలు ఉండడం వల్ల అరకు రూట్ లోని అందాలను తనివితీరా చూసే వీలు ఉంటుంది. ఈ సీట్లను 180 డిగ్రీల కోణం లో తిప్పుకొనే వీలు ఉంటుంది. ఒక్కో సీటు కు ధర అరకు వరకు 625 రూపాయలు గా ఉంది. కానీ ఘాటీలతో కూడిన రూట్లో.. పచ్చదనాన్ని చూస్తూ వెళ్లే ప్రయాణం ఇచ్చే అనుభూతితో పోలిస్తే... ఆ ధర ఏమంత ఎక్కువ కాదని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. త్వరలో ట్రైన్ మొత్తం గాజు బోగీలతో నడపాలనే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. 




84 వంతెనలు, 58 సొరంగాలు 
వైజాగ్ నుంచి అరకు వరకూ 114 కి.మీ ప్రయాణాన్ని, 84 వంతెనలు, 58 సొరంగాల గుండా .. 4 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేసే కిరండోల్ ట్రైన్ లోని అద్దాల బోగీ గుండా ప్రయాణిస్తూ చూడడం మరపురాని అనుభూతి అంటారు సందర్శకులు. ఒకప్పుడు కేవలం శీతాకాలం సమయంలో మాత్రమే టూరిస్టులు ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం వారు వర్షా కాలంలో కూడా అరకుకు క్యూ కడుతున్నారు.దానితో అద్దాల బోగీల సంఖ్యను పెంచారు. అసలు మొత్తం ట్రైన్ నే విస్తాడోమ్ కోచ్ లతో నడిపే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది.