Floating Bridge In RK Beach Visakhapatnam: విశాఖ: సాగర నగరం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటీ అరవై లక్షలతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం (ఫిబ్రవరి 25న) ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.




ప్లోటింగ్ వంతెనతో పర్యాటకులు పెరుగుతారు 
ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని అన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్లోటింగ్ వంతెన కారణంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.


అందమైన బీచ్ లతో విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. రామ‌కృష్ణ బీచ్‌, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్.. వీటికి తోడు తాజాగా ఫ్లోటింగ్ బ్రిడ్జి విశాఖపట్నానికి మరో ఆకర్షణగా మారనుంది. సముద్రంలో ఎగిసిపడే కెరటాలను దగ్గరగా చూడడంతో పాటు వాటిపై తేలియాడవచ్చు. పర్యాటకులకు ఇదొక మరపురాని అనుభూతిగా మిగులనుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది.