మన వైజాగ్ కి వచ్చేసిన క్రూయిజ్ షిప్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ షిప్ ను బయట నుంచి అందరూ చూశారు. మరి లోపల ఎలా ఉంటుందో చూస్తారా.
ఈ షిప్పు మొత్తం 11 అంతస్తులతో ఉంటుంది. దీని మొదటి అంతస్తులో ఇంజిన్, రెండో అంతస్తులో కార్గో ఉంటుంది. మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్స్ లాంజ్ మొదలవుతుంది. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా పదో అంతస్తు వరకూ ఈజీగా వెళ్లొచ్చు.
పదో ఫ్లోర్‌లో డెక్ ఉంటుంది. లగ్జరీ సూట్‌లు మాత్రం 8 వ ఫ్లోర్లో ఉంటాయి. ఫుడ్ కోర్టులూ, మూడు స్పెషల్ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా,సెలూన్లు టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి.
పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ జోన్‌లు, ఏకంగా కిడ్స్ అకాడమీ పేరుతొ పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డాన్సులు, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం ఉంది. కొత్త సినిమాల ప్రదర్శన కోసం థియేటర్, నైట్ క్లబ్, సూపర్ మార్కెట్, లైబ్రరీ ఇలా ఈ ఓడలో లేని సౌకర్యం అంటూ లేదు.
ఇవి కాకుండా కేసినోలు, అడ్వెంచర్ యాక్టివిటీలు, డీజేలు వీటన్నింటితోసాగే ఈ భారీ షిప్ ను కదిలే ఫైవ్ స్టార్ హోటల్‌గా చెప్పొచ్చు.
కేసినోలోకి అందరికీ ఎంట్రీ ఉచితమే అయినా.. ఆడాలంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉండాలి. అలాగే సముద్రంలో 20 నాటికల్ మైళ్ళు దూరం వెళ్ళాక మాత్రమే క్యాసినోలో గేమ్స్ మొదలవుతాయి.
ఇదొక జీవిత కాలపు అనుభూతి :పర్యాటక మంత్రి మంత్రి రోజా
తొలిసారి ఏపీకి వచ్చిన ఈ భారీ షిప్పును మంత్రి రోజా సందర్శించారు. ఓడ అంతా కలియతిరుగుతూ సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ వైజాగ్‌కు క్రూయిజ్ షిప్ తాను పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో రావడం ఆనందంగా ఉందని .. వైజాగ్ పోర్టులో నిర్మిస్తున్న క్రూయిజ్ టెర్మినల్ పూర్తయ్యాక మరిన్ని ఇలాంటి షిప్పులు వస్తాయన్నారు. ఏపీ పర్యాటక రంగంలో ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ షిప్పు మరలా ఈ నెల 15 వ తారీఖున వైజాగ్ రానుంది. ప్రజల నుంచి ఈ ప్రయాణానికి భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ నెల వరకూ వైజాగ్-చెన్నై ల మధ్య ప్రతీ బుధవారం నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.