AP Minister Botsa Satyanarayana: విజయనగరం జిల్లా పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చే నేతలలో బొత్స సత్యనారాయణ ఒకరు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రం లేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స.. అంచెలంచెలుగా ఎదిగి, జిల్లా రాజకీయాలనే శాసించగల స్థాయికి చేరుకున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన ఆయనకు పార్టీలకు అతీతంగా మంచి పేరు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంత్రిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఎదిగారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఒకానొక దశలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా అంతా భావించారు. అయితే, ఆ అవకాశం త్రుటిలో చేజారింది.
బొత్స సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన పనైపోయిందనే అంతా భావించారు. కానీ, పడి లేచిన కెరటంలా దూసుకొచ్చారు. వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా నుంచి ఏకైక మంత్రిగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించారు. కోల్పోయిన వైభవం తిరిగి సాధించడంలో ఆయన మేనల్లుడు, ప్రస్తుత జిల్లా పరిషత్తు ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అయిన మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పాత్రను కొట్టిపారేయలేం.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచీ మంత్రిగా బొత్స ఉన్నా.. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసింది చిన్న శ్రీను అనే చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే బొత్సకు కుడి భుజంగా ఉన్నారు. ఇన్నాళ్లూ తెరవెనుక రాజకీయాలు నడిపిన శ్రీను.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, జడ్పీ ఛైర్మన్‌గా పదవి చేపట్టిన తర్వాత.. బొత్సకు దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. పేరుకు మంత్రి బొత్స అయినా.. జిల్లాలో పెత్తనమంతా చిన్నశ్రీనుదే. అటు రాజకీయాలు, ఇటు అధికార యంత్రాంగాన్ని శాసించడంలో ఆయనదే కీలక పాత్ర. చాలా వరకూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయననే ఫాలో అవుతున్నారు. ఒకనొక దశలో మంత్రిని పూర్తిగా పక్కనపెట్టేశారన్న ప్రచారం నడిచింది. సత్తిబాబు కంటే చిన్నశ్రీను దగ్గరికి వెళ్తేనే పని అవుతుందన్న నమ్మకం అందరిలోనూ పెరిగింది. ఈ పరిణామాలు బొత్స సత్యనారాయణకు మింగుడుపడలేదు. బొత్సతో పొసగని నేతలను చిన్నశ్రీను చేరదీస్తున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించుకుంటున్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ విభేదాలు
మంత్రి బొత్సకు వరసకు మేనల్లుడు అయ్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బొత్స సొంత తమ్ముడు లక్ష్మణరావు.. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గం నడుపుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పూసపాటిరేగలో ఈ ఇద్దరి మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగింది. లక్ష్మణరావు తనను ఇబ్బంది పెడుతున్నారని బడ్డుకొండ అప్పల నాయుడు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి తాను పోటీ చేయడం గానీ, తన కొడుకును గానీ పోటీలో ఉంచాలని బొత్స లక్ష్మణరావు భావించారు. అందులో భాగంగా కొన్నాళ్లు దూకుడుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే అప్పలనాయుడికి వ్యతిరేకంగా శిబిరం నడిపారు. లక్ష్మణరావును అదుపు చేయాలని అప్పలనాయుడు అప్పట్లో బొత్సను కూడా కోరారు. తర్వాత లక్ష్మణరావు స్పీడు తగ్గినా... నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స వర్సెస్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నట్టుగా పరిస్థితి మారింది. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకి చిన్న శ్రీను బావ అవుతారు. ఇప్పుడు ఆ బంధం కాస్త వియ్యంకులుగా మారింది.
పెరిగిన దూరంతో ఇబ్బందులు
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బొత్స - చిన్నశ్రీనులు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక సందర్భంలో తప్పితే.. ఇద్దరూ కలసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నది లేదు. ఇటీవల జరిగిన చిన్నశ్రీను కుమార్తె వివాహంలోనూ బొత్స కనిపించలేదు. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న టాక్ జిల్లాలో నడుస్తోంది. ఇద్దరూ విడిపోతే పార్టీకే నష్టమని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేడర్లో బలమైన ముద్ర వేసుకున్న చిన్న శ్రీనును కాదని బొత్స సత్తిబాబు ఏమి చేసే పరిస్థితి లేదు. అలాగని బొత్స సత్తిబాబుకు దూరమై రాజకీయాలు చేసే పరిస్థితి చిన్న శ్రీనుకు ఉండదని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అసలు వీరి మధ్య వివాదానికి కారణమేమిటన్న విషయంపైనా ఎక్కడా స్పష్టత లేదు. అసలు వివాదం ఉందా, లేదా అన్నది కూడా తెలియదు.
ఎమ్మెల్యేగా బరిలోకి చిన్నశ్రీను!
ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ బరిలో దిగాలని ఆలోచిస్తున్నారు. అందుకనుగుణంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని ఎస్.కోట, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నుంచి పోటీ చేసే ఆలోచనలో శ్రీనివాసరావు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స కావడం విశేషం.
వచ్చే ఎన్నికల సమయానికి బొత్సను రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో బొత్స కుమారుడు సందీప్ ను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే అవకాశాలూ లేకపోలేదు. ఏదేమైనప్పటికీ.. చిన్న శ్రీను సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇదే సందర్భంలో మిగిలిన నియోజకవర్గాలపైనా తనదైన శైలిలో రాజకీయ చతురతను కనబరుస్తూ దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకంగా ఉన్న బొత్సకు.. ఇప్పుడు సొంత కుటుంబంలోని పరిణామాలు తలనొప్పిగా మారాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు.