Vizianagaram News : విజయనగరం నగరపాలకసంస్థ మేయర్-1 ఇసరపు రేవతీదేవి తన పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను ఏప్రిల్ 17వ తేదీన మేయర్ వెంపడాపు విజయలక్ష్మికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. రేవతీదేవి రాజీనామా లేఖను మేయర్ విజయలక్ష్మి ఆమోదించారు. రాజీ నామా లేఖను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నగర పాలక సంస్థ అధికారులు నివేదించారు. రేవతీ దేవి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన డిప్యూటీ మేయర్-1 పదవికి జూన్ 8వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ గానీ, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో గానీ ఎన్నిక నిర్వహించాలని, ఈమేరకు పాలకవర్గ సభ్యులకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు 4వ తేదీలోగా నోటీసు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నగర పాలక సంస్థ కొత్త డిప్యూటీ మేయర్ గా ఒకటవ వార్డు సభ్యురాలు ముచ్చు లయ, 7వ వార్డు సభ్యురాలు మాలతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలక వర్గం మొదట్లో డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన ఒకటో వార్డు సభ్యురాలు ముచ్చు నాగలక్ష్మి 2021 మే 19వ తేదీన మరణించారు. అదే సంవత్సరం ఆగస్టు 4వ తేదీన నిర్వహించిన ఎన్నికలో అదే సామాజిక వర్గానికి చెందిన (యాదవ) రేవతీ దేవిని డిప్యూటీ మేయర్-1గా ఎన్నుకున్నారు. అయితే జూన్ 8వ తేదీన నిర్వహించే ఎన్నికలో అదే సామాజిక వర్గానికి చెందిన ఏడో వార్డు సభ్యురాలు మారుతితో పాటు ముచ్చు లయలలో ఒకరిని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకునేందుకు వైఎస్ఆర్సిపీ నాయకులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మాలతీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే రేవతి దేవి రాజీనామా చేసినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిన్నర తర్వాత రాజీనామా చేయాలని ఆ తర్వాత ఆ పదవిని మరొకరికి ఇస్తామని ముందుగానే ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా ఇదే సామాజిక వర్గం నుంచి మరొక అభ్యర్థిని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. మరో వైపు వైసీపీ లో విభేదాల వల్లే ఆమె రాజీనామా చేశారని మరో వర్గం ఆరోపిస్తోంది.
అయితే రేవతి రాజీనామా వెనుక పార్టీలో అతంర్గత కలహాలు ఉన్నాయన ిచెబుతున్నారు. ఇటీవల డిప్యూటీ మేయర్ రేవతికి తెలియకుండానే కొన్ని పనులు ఆమె డివిజన్‌లో చకచకా జరిగిపోతున్నాయి. ఏ ఎన్నికల్లోనూ వైసీపీకి పనిచేయని ఒకరికి నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్ వర్క్స్‌లో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం కల్పించారు. ఇది కూడా డిప్యూటీ మేయర్‌కు తెలియకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. ‘వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నా కోసం మీరు మౌనం వహించకతప్పద’ని ఎమ్మెల్యే కోలగట్ల.. డిప్యూటీ మేయర్ రేవతికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమెతో పాటు, భర్త రామకృష్ణ కూడా నోరుమెదపని పరిస్థితి ఏర్పడింది. పార్టీని నమ్ముకుని శ్రమించిన వారికి ఎటువంటి ప్రయోజనం కల్పించకుండా, తమకు తెలియకుండా ఎవరికో ఉద్యోగం ఇవ్వడమేంటని ఇటీవల డిప్యూటీ మేయర్ దంపతులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవికి రేవతి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు.