ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమైన దుర్ఘటన అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాదాపు 300 మంది ప్రయాణికులకు మృతి చెందడం, 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడడం దేశ చరిత్రలోనే విచారకరం. ఇంతమంది ప్రయాణికులు మృతిచెందడం దేశ ప్రజలనే కాదు.. ఇతర దేశాల ప్రజలను సైతం కలిచివేసింది. మృతులకు నా ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ.. ఈ బాధను తట్టుకునే శక్తి, ధైర్యాన్ని వారికి భవవంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నా అన్నారు రామ్మోహన్ నాయుడు. 


క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భవంతుడిని ఆకాంక్షించారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్‍లో 178 మంది ఏపీ వాళ్లు ఉన్నారని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో ఉత్తరాంధ్రవాళ్లతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున సహాయక చర్యల్లో పాల్గొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పంపించామని తెలిపారు. ఈ చర్యల్లో పాల్గొనేందుకు అవకాశం ఉన్నవారు మానవతా దృక్పతంతో పాల్గొనాలి. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు మానవత్వంతో ముందుకొచ్చిన యువకులను అభినందనలు తెలిపారు.  


టెక్నాలజీని వినియోగించుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, రైల్వేశాఖ, రైల్వే మంత్రిపై ఉంది. ఆధునీకరణ వ్యవస్థతో రైళ్లు నడుపుతున్నామని ప్రకటిస్తున్న రైల్వేశాఖ.. ఇంతపెద్ద దుర్ఘటన ఏవిధంగా జరిగిందని ప్రతి భారతీయుడు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ సంఘటనపై విచారణ జరిపి ఇందులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. భవిష్యత్‍లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పార్లమెంట్‍లో చట్టాలు చేయాలన్నా సహకరించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే మనతప్పే అవుతుంది.. ఇలాంటి సంఘటనలు జరగకుండా రైల్వేశాఖపై చర్యలు తీసుకోవాలి. రైలు ప్రమాదం ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉంటే తమకు వివరాలు తెలియజేస్తే.. వీలైనంత త్వరగా వారితో కనెక్ట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని  ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.


బాలాసోర్‌లో ముగిసిన సహాయక చర్యలు
ఒడిశాలోని బాలాసోర్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రధాని స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శిస్తారని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. రైలు బోగీలను పట్టాలపై నుంచి పక్కకు తొలగిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రైలు లైన్ క్లియర్ చేసి రైలు సర్వీసుల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.


288కు పెరిగిన మృతుల సంఖ్య
#OdishaTrainTragedy: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుందని ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, ప్రస్తుతం దాదాపు 400 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని సమాచారం.