Chandrababu News: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (జూలై 11) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనుల పరిశీలన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అనకాపల్లిలోని దార్లపూడికి చంద్రబాబు చేరుకొని.. 11:20 గంటలకు పోలవరం ఎడమ కాలువ అక్వాడక్ట్‌ను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు జరుగుతున్న చోటుకు వెళ్తారు. మధ్యాహ్నం 12.30 - 1.30 వరకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మెడ్ టెక్ జోన్ భవనాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.50కి విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్‌లో అధికారులతో రివ్యూ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.


చంద్రబాబు పర్యటన కోసం ఇప్పటికే సన్నద్ధతలను విజయనగరం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు ప్రాంతంలో క‌లెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప‌ర్యటించి, ఏర్పాట్లపై అధికారుల‌తో స‌మీక్ష చేశారు. భ‌ద్రత ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్‌తో మాట్లాడారు. ఇప్పటికే ర‌న్‌ వే నిర్మితం కాగా.. దానిపైనే హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ దగ్గరికి చేరుకొని వివిధ శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, వీఐపీ లాంజ్ ఏర్పాట్లపై ప‌లు సూచ‌న‌లు చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు విజయనగరం జిల్లాకు వస్తున్నారు. కాబట్టి, ఏర్పాట్లలో తేడా ఉండకూడదని.. ఎటువంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని అధికారుల‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


భోగాపురం పనులను గతంలోనే పరిశీలించిన కేంద్ర మంత్రి


మోదీ కేబినెట్ లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గతంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వంలోనే 2015 లో దీనికి అనుమతులు ఇచ్చారని అప్పట్లో మంత్రి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆలస్యం జరిగిందని విమర్శించారు. డిసెంబర్ 26 నాటికి పూర్తిగా చేస్తామని చెప్పారు. 2026 నాటికి ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.