Chandrababu on Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని, వారు రెచ్చగొడితే తాను మాత్రం రెచ్చిపోనని చెప్పారు. గతంలో వాజ్ పేయీ హాయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు దీర్ఘకాలికంగా బలం చేకూర్చేలా చర్యలు తీసుకున్నట్లుగా చంద్రబాబు గుర్తు చేశారు. ఈ మధ్య సంబంధిత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో తాను మాట్లాడానని, కావాల్సిన నిధులు విడుదల చేసి స్టీల్ ప్లాంటు కంటిన్యూగా రన్ అయ్యేలా చూస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు సరైన యాజమాన్యాన్ని నియమించుకొని, దాన్ని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
‘‘ఏపీ రాష్ట్రానికే తలమానికం అయిన అతి పెద్ద ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రాష్ట్రానికి చాలా సెంటిమెంట్. ఈ విషయాన్ని ఒకసారో రెండుసార్లో మాట్లాడుకుంటే బావుంటుంది కానీ, ఊరికే ఈ విషయంపై చర్చించుకుంటే బావుండదు. మన తెలివి తేటలు ఉపయోగించి ఫ్యాక్టరీని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా పని చేద్దాం. నష్టాలకు తరచూ చారిటీల మాదిరిగా నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి రాకుండా.. శాశ్వతంగా ఫ్యాక్టరీని పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు మాట్లాడారు.