చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవలో టీడీపీ నేతలు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరివలో షిరిడి సాయి ఆలయం వద్ద నుంచి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పడంతో గొడవ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామని ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ శ్రేణులు, నాయకులు తేల్చి చెప్పి ముందుకు కదలడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తమ పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించినట్లు మహిళా కార్యకర్తలు ఆరోపించారు.


చంద్రబాబు విడుదల అయ్యే వరకు దీక్ష చేస్తా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే వరకు దీక్ష చేస్తానని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజలకు తెలిసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో రెండో రోజు వరుసగా దీక్షను కొనసాగించారు. చంద్రబాబు విడుదల అయ్యేంతవరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగులు వచ్చేలా చంద్రబాబు కృషి చేశారని, ఇలాంటి వ్యక్తిని దృదేశపూర్వకంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న అధికారులు ఎవరూ సీఎం జగన్ కు సహకరించవద్దని కోరారు. 


కార్ల ర్యాలీకి అనుమతి లేదు...
టీడీపీ అధినేత చంద్రబాబు కు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం నిర్వహించ తలపెట్టిన కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణ టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.


గుంటూరు జిల్లా కార్యాలయంలో చంద్రబాబు కు తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలు జరిగాయి. టీడీపీ రాష్ట్ర వాణిజ్య  విభాగం అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ సరికాదని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం మణిపూర్ బ్రిడ్జి దగ్గర చంద్రబాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు జరిగాయి.  పొన్నూరులో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద చంద్రబాబు మద్దతుగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.


చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ గుంటూరు జిల్లా తాడికొండలో నాయకులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని తాడికొండ పోలీసులు తొలగించారు. ఎవరూ లేని సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి టెంట్ ను తొలగించారు. పెదకాకాని మండలం నంబూరులో రైన్ ట్రీ పార్క్ భవనం వద్ద కాలనీవాసులు చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తాడికొండలో మహిళలు పెద్ద ఎత్తున రికార్డులు, నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు చేపట్టారు.