Vizag MLC Elections: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  గెలవడానికి వైఎస్సార్‌ సీపీకే పూర్తిగా బలం ఉందని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోబోయే వారిలో అధిక మంది వైసీపీ నేతలే అని అన్నారు. తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్నా కూడా అనైతికంగా కూటమి సర్కార్‌ అభ్యర్థిని పోటీలో నిలిపిందని విమర్శించారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు నామినేషన్ పత్రాన్ని అందించారు. బొత్సతో పాటు ఆయన సతీమణి ఝాన్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి, వెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలసి అందజేశారు. 


విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు హక్కు వినియోగించుకోనున్న 840 ఓట్లలో 620 ఓట్లు వైఎస్ఆర్ సీపీకే ఉన్నాయని అన్నారు. కూటమికి కేవలం 200 ఓట్లు సంఖ్యా బలం మాత్రమే ఉందని వివరించారు. తమకు భారీగా ఓటర్ల బలం ఉన్నప్పుడు కూటమి పార్టీలు తమ అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతున్నాయని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌ సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. మద్దతు ఇస్తున్న సభ్యుల సంఖ్య దగ్గరగా ఉంటే టీడీపీ పోటీలో నిలిపినా తప్పులేదు కానీ.. తమకు మెజార్టీ ఉన్నప్పుడు వారు అభ్యర్థిని ఎందుకు నిలబెడుతున్నారని మాట్లాడారు.


530 పైచిలుకు మాకు ఓట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో పోటీ చేయించడం ఏమిటని అన్నారు. ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాను. స్పష్టమైన మెజార్టీ వైసీపీకి ఉన్నప్పుడు టీటీడీపీ పోటీ ఎందుకు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం అవుతుందన్నారు. ఎవరో బిజినెస్ మేన్ తీసుకొచ్చి పోటీకి పెడతారని ప్రచారం జరుగుతుంది’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయాలంటే వ్యాపారమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.