Underwater celebration for Ayodhya Ram Mandir Inauguration: విశాఖపట్నం: దాదాపు 5 శతాబ్ధాల తరువాత కోట్లాది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ మందిరం సోమవారం ప్రారంభించారు. ఆలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఓ అపూర్వమైన, చారిత్రాత్మక, సాంస్కృతికంగా ముఖ్యమైన సంఘటనగా అభివర్ణించవచ్చు. దేశ వ్యాప్తంగా రామ మందిరం వేడుకను పురస్కరించుకుని తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు.
ఈ శుభ సందర్భానికి గుర్తుగా అద్భుతమైన వేడుకలో తాము భాగస్వాములు కావాలని మహాసముద్ర రాయబారులు ఒక ప్రత్యేకమైన ప్రయత్నాన్ని ప్రారంభించారు. లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి నిలువెత్తు రూపాన్ని ప్రదర్శించారు. విశాఖలోని రుషికొండ తీరంలో దాదాపు 22 అడుగుల లోతులో ఈ కార్యక్రమం నిర్వహించారు. 500 సంవత్సరాల కలను అయోధ్యలో జరిగిన నేటి ప్రాణ ప్రతిష్ట సాకారం చేయడంతో భక్తులు పరవశించిపోతున్నారు.
విశాఖలో స్కూబా డైవింగ్ బృందం శ్రీరాముడి కటౌట్ ను నీటి అడుగుకు తీసుకెళ్లి ప్రదర్శించి తమ భక్తిని చాటుకుంటూ సెలబ్రేట్ చేసింది. ఇందులో పాల్గొన్నవారు బుడగలు, పూల జల్లులతో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు జ్ఞాపకంగా ఈ పని చేశారు. ఈ ఆవిష్కరణతో సంప్రదాయాన్ని అందంగా మిళితం చేసిన దృశ్యాన్ని నీటి అడుగున సృష్టించారు. అయోధ్యలో జరిగిన వేడుకను దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మాజీ సబ్‌మెరైనర్ ఇండియన్ నేవీ, లైవిన్ అడ్వెంచర్స్ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు మాట్లాడుతూ.. డైవర్స్ రామయ్య నిలువెత్తు రూపాన్ని నీటి అడుగన ప్రతిష్టించారని చెప్పారు. అయోధ్యలో రాముడి వేడుకకు పురస్కరించుకుని తాము నీటి అడుగున రామ ప్రాణ ప్రతిష్ఠ చేయడం స్థానికంగా ఎందరినో ఆకర్షించిందని చెప్పారు. డైవర్స్ చేసిన సెలబ్రేషన్.. మరింత మందిని ఆకర్షిస్తుందని విశ్వాసం ఉందన్నారు. నీటి అలల కింద భక్తిని ధైర్యసాహసాలతో ఈ అద్భుతాన్ని ప్రదర్శించారని చెప్పారు.