ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అమర్నాథ్

AP Skill development center: ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.

Continues below advertisement

AP Skill development center:
విశాఖపట్నం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద చర్చకు రమ్మనమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నారా లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ.డీ., ఐ.టీ, సిఐడి అధికారులు విచారణకు రమ్మనమని లోకేష్ ను పిలుస్తుంటే, దానిపై మాట్లాడకుండా సీఎం జగన్ ను చర్చకు పిలిచిన లోకేష్ తన స్థాయి ఏంటో, బతుకేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. 

Continues below advertisement

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ పాత్ర బయట పెట్టడానికే దర్యాప్తు సంస్థలు ఆయనను పిలుస్తున్నాయని అన్నారు. 371 కోట్ల రూపాయలు తినేసి, అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు సీఎం జగన్ ను బహిరంగ చర్చకు ఏ విధంగా పిలుస్తున్నారని ప్రశ్నించారు. తన తండ్రికి, ఈ స్కాంకు ఏ సంబంధం లేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నాడని అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. రెండు ఎకరాలతో జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో నే నాల్గవ ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు తన ఆస్తి 683 కోట్ల రూపాయలుగా చూపించాడంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

చంద్రబాబు, ఆయన సన్నిహితులు చెబుతున్న కథనాలను సీమెన్స్ యాజమాన్యం కొట్టిపారేసిందన్నారు. తమకు ఎక్కడ గ్రాంట్ ఇచ్చే ప్రాజెక్టులు లేవని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కె నేరుగా చెప్పిందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో రూ.553 కోట్లతో ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయినా పెట్టినట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేసేస్తానని సవాల్ విసిరారు. స్కాంపై దర్యాప్తు సంస్థలు చంద్రబాబుని, లోకేష్ ని విచారించడానికి సిద్ధమవుతుండగా తండ్రి కొడుకుల వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంలో సంతకాలు చేయలేదని చంద్రబాబు బుకాయిస్తున్నాడని, ఆయన 13 చోట్ల సంతకాలు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. 

చంద్రబాబు నేరాలలో కేవలం తీగ దొరికిందని, అవినీతి డొంక కదలక మానదని అమర్నాథ్ హెచ్చరించారు. చంద్రబాబుకు జైల్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయంటూ.. దుష్ప్రచారం చేస్తున్నారని.. రాజమండ్రి పుష్కరాలలో చనిపోయిన 29 మంది ఆత్మలు చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఘోషిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు భయపెట్టి చంపేసిన వారి ఆత్మలు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నాయేమోనని అమర్నాథ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్షన్, రాజకీయాల్లో ఓవరాక్షన్ చేస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగా హత్యకు, ముద్రగడ పద్మనాభం పై దాష్టీకానికి చంద్రబాబు బాధ్యుడని తెలిసినా ఏనాడు వాటిని ఖండించని పవన్ కళ్యాణ్ చెబితే ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఏనాడూ మద్దతు తెలపని పవన్ కళ్యాణ్  మాటలను ప్రజలు విశ్వసిస్తారా అన్నారు. జనసైనికులు జెండా కూలీలుగానే మిగిలిపోనున్నారని, ఇప్పటికైనా జనసేనని టిడిపిలో విలీనం చేస్తే మంచిదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రెండు జెండాలు పట్టుకుని తిరిగే కన్నా టిడిపి జెండా పట్టుకుని తిరిగితే సరిపోతుందని సెటైర్లు వేశారు. జగన్ క్యాబినెట్లో ఐదుగురు మంత్రులు, ఆయన టీం లో 30 మంది ఎమ్మెల్యేలు, జడ్పిటిసి, ఎంపీటీసీలు కాపులే ఉన్నారని అమర్నాథ్ గుర్తు చేశారు.

Continues below advertisement
Sponsored Links by Taboola