విశాఖపట్నం: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురితో వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా తీయించుకున్నారని.. సినిమా నటి శ్రీదేవి నటనను కూడా మైమరిపించే విధంగా ఆమె ఆ కొద్దిపాటి సమయం నటించారని, వెనువెంటనే ప్రతిపక్షాలు ఇచ్చిన భారీ మొత్తాన్ని తీసుకొని ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడే చెప్పొచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు కులం కార్డు అడ్డుపెట్టుకొని అందరి మీద విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల నుంచి భారీ మొత్తం తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తు రాలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.


ఊసరవెల్లిలా పార్టీ మారి శ్రీదేవి పెద్ద ఊసరవెల్లి దగ్గరకు వెళుతున్నారని అందుకే ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా, ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రాపాక ప్రసాద్  ప్రతిపక్ష పార్టీ ప్రలోభ పెట్టినా లొంగలేదని, అసెంబ్లీకి వెళుతున్న సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ తనను ప్రలోభ పెట్టిందని చెప్పిన విషయాన్ని అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ శ్రీదేవి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరించారని అన్నారు. చేసిందంతా చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని, దళితులు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో విజయాన్ని చూసి చాలా రకాలుగా మాట్లాడుతున్నాడని, అయన వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు.


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారని, పోలింగ్ ముందు వరకు ఉపాధ్యాయులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు కూడై కూసాయి. ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ల నోళ్లు మూతపడ్డాయని అన్నారు. 2024 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు ఇకపై ఏ ఎన్నికల్లో కూడా గెలవలేడని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.


ఏపీకి రావాలంటేనే భయమేస్తోంది..
పార్టీ నుంచి తనను తప్పించేందుకు ముందు నుంచి తనపై కుట్ర జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను బూచీగా చూపి తనపై వేటు వేశారని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి అన్నారు. తనపై కొంత మంది వైఎస్ఆర్ సీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర ఆరోపణలతో వేధిస్తున్నారని శ్రీదేవి అన్నారు. ఈ వార్తలు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా వచ్చాయని అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తానేమైనా గ్యాంగ్ స్టరా అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ అంటూ కథనాలు వస్తున్నాయని అన్నారు. తన ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాలో భాగంగా అందరూ ముడుపులు పంచుకున్నారని, ఉద్ధండరాయుని పాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ప్రశ్నించారు. తాను లోకల్ దందాలకు సహకరించడంలేదని ఇలా వేటు వేశారని అన్నారు. తనకు ఏపీ రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ఏపీలో ఎస్సీలకు రక్షణ లేదని అన్నారు.