గడప గడపకు ఓ మంచి కార్యక్రమం మరింత ప్రణాళికతో ముందుకు సాగుతాం పార్టీలో కొనసాగుతూ నష్టపరిచే వారిని బహిష్కరిస్తాం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కొందరు వాలంటీర్లను గుర్తించాం... ఏరివేతకు వెనుకాడేది లేదు అవినీతి లేని పాలన అందిస్తున్నాం అదే మన ధైర్యం మనకంటే ప్రత్యర్థి పార్టీ అంత బలంగా లేదునియోజకవర్గంలో మండలస్థాయి నాయకత్వం ఉందన్నారు. ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మెజార్టీ రాని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీలోనే కొనసాగుతూ వ్యతిరేకులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. స్థానిక టౌన్ హాల్ వైకాపా నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా కార్యక్రమానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూరల్ మండల నాయకులు అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గడప గడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, గడప గడపకు ముందు.. అటు తర్వాత ప్రభుత్వ గ్రాఫ్ పెరిగిందని ధర్మాన స్పష్టం చేసారు.
మనం భయపడినంతగా ఏమీ లేదని.. సమావేశాలకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన బాగుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించే అవకాశం దొరికిందన్నారు. కొన్ని చోట్ల మౌళిక వసతులు తదితర చిన్న చిన్న సమస్యల పట్లే కొంతమంది ప్రశ్నించారని ధర్మాన తెలిపారు. అవినీతి లేని పాలన అందిస్తున్నామని, అదే మన ధైర్యమంటూ ధర్మాన పేర్కొన్నారు. వాలంటీర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి పెద్ద కన్నం పెట్టేది వారేనని ధర్మాన తెలిపారు. ఇప్పటికే పలువురిని గుర్తించడం జరిగిందని, వ్యతిరేకులను ఏరివేత చర్యలకు సైతం వెనుకాడేది లేదని స్పష్టంచేశారు.
మనకంటే ప్రత్యర్థి పార్టీ అంత ఏమీ లేదని, వైకాపా నాయకులంతా ఒక నాయకత్వంలోనే సమిష్టిగా ఉన్నారని ధర్మాన స్పష్టంచేశారు. మిగిలిన నియోజకవర్గాల కంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వినూత్నమైన పద్ధతిలో నిర్వహించామని, మనం అనుసరించిన పద్ధతి సత్ఫలితాలు ఇచ్చాయని ధర్మానఅభిప్రాయం వ్యక్తంచేశారు. గడప గడపకు కార్యక్రమం కొనసాగించేందుకు అంతరాయం తలెత్తిందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాల నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే 57 కార్యక్రమాలు గడప గడపకు సంబంధించి సమర్ధవంతంగా నిర్వహించామని మరింత పకడ్బందీగా మిగిలిన 37 సచివాలయాల్లో పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణలో రూరల్ మండలంతో పాటు అర్బన్ పరిధిలోనూ విలీన పంచాయతీలతో సహా శ్రీకాకుళం కార్పొరేషన్లో సైతం పలు వీధుల్లో వెనుకబాటులో ఉన్నామని ధర్మాన అసహనం వ్యక్తంచేసారు. సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడం వలనే గడప గడపకు కార్యక్రమాన్ని ఈ ప్రాంతాల్లో సమర్ధవంతంగా జరగలేదని, దీనికి కారణం నాయకత్వ వైఫల్యమేనన్నారు. గడప గడపకు ముందు.. ఆ తర్వాత మన కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం ప్రభుత్వ పాలన పట్ల వారి స్పందన స్పష్టంగా తెలిసిందని, మనం భయపడినంతగా ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు ఉన్న లోపాలను చక్కదిద్దుకోవాలని, సరైన దిశగా పార్టీ పటిష్టతకు నాయకత్వ బాధ్యత నిర్వహించలేని వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకుని కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని ధర్మాన సూచించారు.
గడప గడపకు మలివిడత కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో పూర్తి చేసేందుకు మీరంతా సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. పూర్తిస్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలకు తాను తప్పనిసరిగా హాజరౌతానని, స్థానికంగా లేనిపక్షంలో ఆయా నాయకత్వాలే ఎటువంటి లోటుపాట్లు లేకుండా అంతే సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సమయం ఆసన్నమైందని, ఏడాదే గడువంటూ పార్టీ శ్రేణులకు ధర్మాన దశ, దిశ నిర్దేశం చేసారు. గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గంలో పోటీ చేసిన అనేక గ్రామాల్లో ఆశించిన మెజారిటీ రాలేదని, ఆయా గ్రామాల్లో బూత్ స్థాయిలో మెరుగైన మెజారిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
త్వరలోనే డెడికేటెడ్ నెట్వర్క్ తో ఈనెల 17న మరోదఫా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని, వారు ఇచ్చిన సమాచారమే ఫైనల్ అని, మనకు భవిష్యత్ ఎన్నికల్లో ఓటెయ్యని కుటుంబాల గడప కూడా తొక్కనని ధర్మాన స్పష్టంచేసారు.ఈలోగా గ్రామాల వారీగా, మండలాల వారీగా సంపూర్ణ సమాచారాన్ని క్రోడీకరించి భవిష్య కార్యాచరణకు కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయడం జరుగుతుందని ధర్మాన స్పష్టంచేశారు.