వాళ్లకీ వీళ్లకీ కాదు, ఇక నేరుగా జగనన్నకే చెబుదామంటున్నారు ఏపీ ప్రజలు. అవును.. వారికీ వీరికీ మీ సమస్యలు చెప్పి విసిగిపోయారా..? నేరుగా సీఎం జగన్ కే చెప్పండి అంటూ ప్రభుత్వం కూడా ప్రజలకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఆ కార్యక్రమం పేరు జగనన్నకే చెబుతాం. మే-9(రేపటి) నుంచి అధికారికంగా ఈ కార్యక్రమం మొదలవుతుంది. 


అసలేంటీ కార్యక్రమం..
ఇప్పటి వరకూ జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో సచివాలయాల్లో, మండల స్థాయిలో తహశీల్దార్ ఆఫీసుల్లో, ఆర్డీవో ఆఫీసుల్లో, జిల్లా స్థాయిలో కలెక్టరేట్లలో అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అధికారులకు చెప్పినా పరిష్కారం కాని సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి చేరవేయడమే జగనన్నకు చెబుదాం. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేపట్టి, ఫైనల్ గా మే-9నుంచి పట్టాలెక్కిస్తున్నారు. 


ఇటీవల అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం జగన్ జగనన్నకు చెబుదాం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పారు. స్పందనకు మరింత మెరుగైన రూపం ఇదని అన్నారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే దీని లక్ష్యం అని వివరించారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ ని అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అని అధికారులకు చెప్పారు జగన్. 


ఫైనల్ గా జగన్ దగ్గరకు పంచాయితీ..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు మరో ఎత్తు. ఏళ్ల తరబడి చాలామంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుంటారు. కొన్నిటికి పరిష్కారం ఉండదని తెలిసినా వారు ప్రయత్నాలు మాత్రం ఆపరు. ఇలాంటి వాటిల్లో ఇటీవల చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం చూపారు జగన్. ఇలాంటి సమస్యలన్నిటికీ అధికారులు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోటే స్పందన కార్యక్రమం రూపొందించారు. ఈ స్పందనల్లో కూడా పరిష్కారం కాని సమస్యలు చివరిగా జగనన్నకు చెబితే పరిష్కారం కావాల్సిందే. అలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 


రేపటినుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన 1902 హెల్ప్ లైన్ నెంబర్ కి ప్రజలు కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సీఎం జగన్ కి వినిపిస్తారు అధికారులు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌ లైన్‌ ద్వారా సమస్యలను తెలుసుకుంటారు. వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి. గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అనేది ఇందులో చాలా ముఖ్యం. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. జగనన్నకు చెబుదాం అనే ప్రయోగం ఫలిస్తే ఎన్నికల వేళ అది వైసీపీకి మరింత మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది.