నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో భాగంగా సోమవారం సంతకాల సేకరణ, వాట్సప్ మెసేజ్ లను పంపే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు లోని కోటంరెడ్డి కార్యాలయానికి క్రిస్టియన్ పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు తరలి వచ్చారు. తమ తమ సెల్ ఫోన్ల నుంచి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి, జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వాట్సాప్ ద్వారా విజ్ఞాపనలు అందించారు. పోస్ట్ కార్డుల ద్వారా కూడా విజ్ఞాపనలు పంపించారు.


పోరుబాట..
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం అని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత నాలుగేళ్లలో 2019లో ఒకసారి, 2021లో ఒకసారి, 2022లో ఒకసారి, స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం 3 సార్లు సంతకాలు చేయించానని, అయినా పని కాలేదని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సాక్షాత్తూ సీఎం మూడు సార్లు సంతకాలు చేసినా అతీగతీ లేదని సెటైర్లు వేశారు. 


అప్పచి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వేదాయపాళెం, గాంధీ నగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం 150 అంకణాల స్థలాన్ని కూడా కేటాయించేలా చూశామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా నేడు ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు. వేల మంది క్రిస్టియన్ సోదరులకు మేలు చేసే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం 6 కోట్లు నిధులు ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 


10రోజులపాటు ఉద్యమం..
ఈరోజు మొదలైన వాట్సప్ ఉద్యమం 10రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 10 రోజులపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి, జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 10వేలకు పైన విజ్ఞాపనలు పంపిస్తామన్నారు. మెసేజ్ లతో వారి వాట్సాప్ క్రాష్ అయిపోవాలన్నారు. అప్పుడైనా వారు ఈ సమస్యపై దృష్టి పెడతారని చెప్పారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు కేటాయించిన స్థలంలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 


ఈ నెల 18వ తేదీ లోపల మంత్రులు, ఇన్ చార్జులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు కోటంరెడ్డి. నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటి హాల్ కోసం 6 కోట్లు నిధులు విడుదల చేస్తామని బహిరంగ ప్రకటన చేయకపోతే ఈ నెల 22వ తేదీన ప్రతీ చర్చి నుంచి ఒక్కో ఇటుక రాయిని తీసుకువచ్చి, క్రిస్టియన్ సోదరులతో గాంధీ నగర్ లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలం వద్ద నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. 


తన మాటల్లో స్వచ్చత ఉందనుకుంటే, నిజాయితీ ఉందనుకుంటే, ప్రజలందరు ఈ విషయంలో తనకు అండగా నిలబడాలని కోరారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అధికార పక్షానికి దూరంగా జరిగినా రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని, మాటతప్పని, మడమతిప్పని పోరాటాలు ప్రజల అండతో చేస్తామన్నారు.