INS Magar: ఆ నౌక శత్రు దుర్భేద్యం. అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఈ నౌక శత్రువులకు సింహస్వప్నం. నీటిలో, నేలపై సైతం శత్రువులపై దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. అందుకే దీనికి మగర్ (మొసలి) అనే పేరు పెట్టారు. శత్రువులపై దాడి మాత్రమే కాకుండా విపత్తుల వేళ కూడా విశేష సేవలందించింది ఐఎన్ఎస్ మగర్. పలు రకాల సేవలు అందిస్తూ భారత నౌకాదళంలో దాదాపు 36 ఏళ్ల పాటు పని చేసిన ఐఎన్ఎస్ మగర్ మే 7వ తేదీతో తన విధులకు స్వస్తి పలికింది. వార్ ఫేర్ వెసెల్ గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటింది మగర్. ఐఎన్ఎస్ మగర్ కు భారతీయ నౌకాదళం ఆదివారం నాడు ఘనంగా వీడ్కోలు పలికింది. 


ఆ సామర్థ్యం ఉండబట్టే మగర్ అనే పేరు


ఉభయచర యుద్ధ నౌకల్లో చాలా కాలంపాటు కీలకంగా వ్యవహరించింది ఐఎన్ఎస్ మగర్. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లో మగర్ ని యాంఫిబియాస్ షిప్ గా తీర్చిదిద్దారు. మామూలుగా అయితే షిప్ లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ మగర్ మాత్రం ఒడ్డు వరకూ వచ్చే సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యం వల్ల మగర్ ఒడ్డు వరకు వచ్చి సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించేది. ఇలాంటి సామర్థ్యం ఉండబట్టే దీనికి మగర్ అనే పేరు పెట్టింది భారతీయ నౌకాదళం. 


సుదీర్ఘ సేవలు అందించిన ఐఎన్ఎస్ మగర్


1987 జులై 15న భారత నౌకాదళంలో మగర్ ప్రవేశించింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్ఎస్ మగర్ ని కేటాయించింది సైన్యం. ల్యాండింగ్ షిప్ ట్యాంక్ - ఎల్ఎస్టీ హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు చేరవేస్తుండేది. నలుగురు ల్యాండింగ్ క్రాఫ్ట్ వెహికల్ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ పవన్ లో మగర్ కీలక పాత్ర పోషించింది. 


వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా


నిరంతర పోరాటం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ - ఐపీసీకే కు అవసరమైన సామగ్రిని మగర్ అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా చాటింది. 2006 వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన విశాఖ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో మగర్ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం జరిగింది. షిప్ లో మంటలు చెలరేగడంతో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2018వ ఏడాది వరకు విశాఖ కేంద్రంగా మగర్ సేవలందించింది. 2018 ఏప్రిల్ లో మగర్ ను కొచ్చికి తరలించారు. మార్పులు చేర్పులు చేసిన తర్వాత మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా సేవలు అందించింది.సునామీలో విశిష్ట సేవలు అందించింది మగర్. 2004లో వచ్చిన సునామీ సమయంలో మగర్ చేసిన సేవలు హర్షించదగినవి.


విపత్తలు వేళ సహాయ సహకారాలు


సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న 1300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది మగర్. అంతేకాకుండా.. అక్కడి నుండి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిలిగిన వారికి సహాయ సామగ్రి అందజేసింది. మగర్ అందించిన సేవలకు గాను అందరి నుండి ప్రశంసలు అందుకుంది. కరోనా సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతులోనూ మగర్ విశేషంగా సేవలందించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. స్నేహపూర్వక దేశాలకు వైద్య సామగ్రి అందించడం మగర్ ద్వారానే సాధ్యమైంది.