AP Minister Dharmana Prasada Rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మీరు కనుక వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి, ఓట్లు వేయకపోతే చాలా నష్టపోతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు చాలా చైతన్యవంతులు అయ్యారని, టీడీపీకి ఓట్లు వేయాలని చెబితే ఎందుకు వేయాలి.. చంద్రబాబు ఏం పనులు చేశారని ప్రశ్నించాలని సూచించారు. ఒక్క కారణం చెప్పాలని గట్టిగా అడగాలన్నారు.


గత ఎన్నికల్లో తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేట, పెద్దపాడులలో తనకు తనకు మెజార్టీ రాలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు. తమ పార్టీకి ఓట్లు వేయడం లేదని, తనకు ఏం కోపం లేదంటూనే స్థానికులకు చురకలంటించారు. అభివృద్ధి పనులు చేయండని అడిగే హక్కు ఆ ప్రాంతం ప్రజలకు లేదన్నారు. తమకు మద్దతివ్వకపోయినా ఈ గ్రామాల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నానని తెలిపారు. రేపు గనక మీరు ఏమరపాటుతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఓడిపోతే.. ఆడవాళ్లను నెత్తిన పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం పతనమైందంటారు. 


గతంలో అధికారంలో ఉన్న సమయంలో అర్హులైన పేదలకు ఇళ్లు కట్టిచ్చి ఇచ్చామన్నారు. మరోసారి నెగ్గినా, పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం, ఇందులో సందేహం లేదన్నారు. కానీ  ఈసారి  ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుగానీ, ఆ పార్టీ నేతలు మీకు ఏం చేశారు. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ఈ సందర్భంగా మంత్రి ధర్మాన స్థానికులకు ప్రశ్నించారు. టీడీపీ నేతలకు భయపడి కొందరు వైసీపీ సమావేశాలకు రావడం లేదని, తన కార్యక్రమానికి సైతం రాకుండా డుమ్మా కొట్టారన్నారు. కొందరు విరేచనాలు అయ్యాయని సైతం చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా ఇదే పార్టీకి పనిచేస్తాను, పలానా పార్టీలో ఉంటారని మీరు ఎవరికీ బాండ్ పేపర్ మీద రాసివ్వలేదని, అభివృద్ధి చేసిన పార్టీని సపోర్ట్ చేయాలని సూచించారు. మీ ప్రాంతం మరింత డెవలప్ కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial