Botsa Satynarayana Press Meet | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా, కుట్రలు అని, మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఏపీ ప్రజలు వారిని నమ్మలేదని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని చెప్పారు. మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు.
ప్రజలు జగన్ ను మరోసారి ఆశీర్వదించారు
ఏపీ ఎన్నికలపై మంత్రి బొత్స మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ను మరోసారి ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు. టీడీపీ కార్యకర్తలు ఓటమి తెలిసి, సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. ఓడిపోతున్నారనే టీడీపీ నేతలు పల్నాడులో దాడులకు పాల్పడ్డారు.. మేం కనుక ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే అంతా క్లోజ్. సచివాలయ వ్యవస్థను అవినీతి రూపు మాపడానికి పెట్టాం. కార్యకర్తలు ఎప్పుడూ నేతల పక్కనే ఉంటారు. మహాత్మా గాంధీ కలలు కన్న వ్యవస్థే సచివాలయ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సేవలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందించారు వాలంటీర్లు.
ఎన్నికల సమయంలో టీడీపీ సహనం కోల్పోయినా, మనం సంయనంగా వ్యవహరించాలని వైసీపీ కార్యకర్తలకు సూచించాం. జగన్ ను అధికారంలోకి తీసుకురావాలి. మహిళలు, యువత, పేద వర్గాలకు మరో ఐదేళ్లు సంక్షేమాన్ని కొనసాగిస్తాం. కవ్వింపులు జరిగినా మా కార్యకర్తలు సహనంగా ఉన్నందుకు ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. తులసివనంలో గంజాయి మొక్కలా కొందరు జర్నలిస్టులు ఉంటారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను టీడీపీ కూటమి నేతలు నన్ను టార్గెట్ చేశారు. అది మా బలంగా భావిస్తాం. కానీ అది టీడీపీ శ్రేణుల బలహీనత.
ఎవరిది కుటుంబ పాలన, మీరే ఆలోచించుకోండి
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నామినేటెడ్ పదవి తీసుకున్నాడు. కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేదు. చంద్రబాబు వదిన పురంధేశ్వరి మరో పార్టీలో అధ్యక్షురాలిగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుళ్లు లోకేష్, భరత్ లు రాజకీయాల్లో ఉన్నారు. కుటుంబ పాలన ఎవరిదో ఇప్పుడు చెప్పండి. ఈవీఎంలు ఎక్కడ భద్రపరచాలి అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ వ్యవస్థ మీద అవగాహన లేక ఈవీఎంలపై కామెంట్లు చేస్తున్నారని’ మండిపడ్డారు.
ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ పెట్టవద్దని మంత్రి బొత్స సూచించారు. తాము గెలిచేస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తే, అది నిజమని బెట్టింగ్ కాస్తే లక్షలు పోగొట్టుకుని, జీవితాలు కోల్పోతారని హెచ్చరించారు. జూన్ 4 వరకు ఆగితే ఫలితాలు ఎవరివైపు తేలుతుందని, వైసీపీ మరోసారి భారీగా సీట్లు సాధించి ఏపీలో అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరు వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు తప్పా, రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు.