Merged mandal in Alluri Sitaramaraju district | చింతూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం కొన్ని ప్రాంతాల్లో అమలుకావడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్‌పురం విలీన మండలాల్లో ఈ పథకం అమలు కాకపోవడం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లకు నిరాశ కలిగిస్తోంది. ఈ విలీన మండలాల్లో రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు తెలంగాణలోని భద్రాచలం వరకు వెళ్లడం వల్ల, వాటిని అధికారులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా చూస్తున్నారు. అయితే, ఈ బస్సులు కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో నడుస్తూ, మిగతా ప్రయాణమంతా ఏపీలోనే సాగుతోంది.
ఈ సర్వీసులను అంతర్రాష్ట్ర బస్సులుగా గుర్తించడం వల్ల, స్థానిక మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి నోచుకోవడం లేదు. కనీసం ఏపీ సరిహద్దులోని చివరి స్టాప్ వరకు అయినా ఉచిత ప్రయాణం అమలుచేయాలని అక్కడి మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం తమకు సైతం అమలయ్యేలా చూడాలని కోరారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15న విజయవాడలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారని తెలిసిందే.
తిరుమలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రజల రిక్వెస్ట్ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం బస్సుల్లో 85 శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లు చెబుతోంది. 11, 449 బస్సులకు గానూ 8,458 బస్సులు స్త్రీ శక్తి పథకానికి కేటాయించింది ఏపీ ప్రభుత్వం. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక కంటే బెటర్ గా ఉచిత బస్సు సర్వీసు ఇస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుమలకు వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులో లేదు. తిరుమల సైతం ఏపీలోనే ఉందని, మొదట హామీ ఇచ్చినట్లుగా తిరుమలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భక్తులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, అవి టీటీడీకి చెందిన బస్సులు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. టీటీడీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే టెక్నికల్ సమస్యలు ఉంటాయని, అందుకే ఈ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం లేదని మార్గదర్శకాలలో ఇచ్చినట్లు గుర్తుచేశారు.
ఏపీలో ఏ బస్సుల్లో ఫ్రీ జర్నీ..రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగానే పలు రకాల బస్‌లలో ప్రయాణం చేయవచ్చు. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా వెళ్లి రావచ్చు. మహిళలతో పాటు ఏపీ ప్రభుత్వం మరికొందరికి కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది.
అంగవైకల్యం 40 శాతానికి మించిన వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీస్‌లలో అయితే వీరికి యాభై శాతం రాయితీ ఇస్తారు. ఏపీలో నివసించే మాజీ సైనికులకు, అమరులైన సైనికుల భార్యలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లలో ఉచితం ప్రయాణం అవకాశం కల్పించారు. అరవై ఏళ్లకు మించిన వయసు ఉన్న వృద్ధులు సైతం పల్లె వెలుగు, సిటీ సర్వీస్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధులతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా ఏసీ బస్‌లు మినహా అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.
పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌లలో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యా సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని విద్యార్థులు ఫ్రీ బస్ పాస్ తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డ్ ద్వారా జిల్లాల్లో పని చేసే జర్నలిస్టులు అన్ని నగర లేదా సబ్‌ర్బన్ బస్‌లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వారి జీవిత భాగస్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది.