Surrogacy fraud case | హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr Namrata) తాను తప్పు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వందల దంపతులను మోసం చేసిన డాక్టర్ నమ్రత

పోలీసుల విచారణలో తాను చేసే నేరాలను సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. సరోగసి పేరిట సంతానం కలగని వందల మంది దంపతులను మోసం చేసినట్లు ఆమె అంగీకరించారు. బాధిత దంపతలు వద్ద నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో అంగీకరించింది. పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఈ దందాలో ఫెర్టిలిటీ సేవల పేరిట అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు వెల్లడైంది. డాక్టర్ అసలు పేరు అట్లూరి నీరజ అయినా, ఆమె "డాక్టర్ నమ్రత" అనే నకిలీ పేరుతో ఇన్నేళ్లపాటు ఫర్టిలిటీ సెంటర్ కార్యకలాపాలు చూసినట్లు తేలింది.

బ్యాచ్ మేట్స్‌తో కలిసి సరోగసి దందా

విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన ఆమె, 1988 బ్యాచ్ మేట్స్‌తో కలిసి సరోగసి దందా చేసినట్లు విచారణలో తేలింది. 2007లో సికింద్రాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సంతానం కలగని దంపతుల వద్ద నుండి సరోగసి పేరుతో రూ.20-30 లక్షలు వసూలు చేశారు. గర్భిణీ అయిన మహిళలకు డబ్బు ఆశ చూపించి, ప్రలోభపెట్టి.. ప్రసవం తర్వాత వారి నుంచి పిల్లలను కొనుగోలు చేశారు. అబార్షన్ చేసుకోవాలనుకున్న మహిళలకు సైతం డబ్బు ఆశ చూపించి డెలివరీ తరువాత నగదు ఇచ్చి చిన్నారులను కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు.

ఆ పిల్లల కొనుగోలులో సంజయ్, సంతోషీ అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించారని డాక్టర్ నమ్రత వెల్లడించారు. తన రెండో కుమారుడు ఈ వ్యవహారంలో లీగల్‌గా సహాయం చేశాడని ఆమె చెప్పింది. మొదట విశాఖపట్నంలో ఓ ఆసుపత్రి ప్రారంభించి, దంపతుల నుండి భారీగా డబ్బులు వసూలు చేశారు. తరువాత సికింద్రాబాద్, పలుచోట్ల బ్రాంచులు ఓపెన్ చేసి ఫర్టిలిటీ సెంటర్ పేరిట సంతానం లేని దంపతులను మోసం చేస్తూ వచ్చారు. 

కేసు దర్యాప్తు చేస్తున్న సిట్

ఈ కేసును ఇప్పటికే నార్త్ జోన్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, డాక్టర్ నమ్రత అలియాస్ అట్లూరి నీరజపై ఇప్పటికే 15కి పైగా కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ దంపతులకు సైతం ఇదే విధంగా సరోగసీ చేశామని, వారికి పుట్టిన సంతానంగా ఇచ్చిన చిన్నారిపై అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్టులు చేపించగా డాక్టర్ నమ్రత, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో చేసిన అక్రమాలు, మోసాలపై సైతం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.

ఇటీవల అరెస్టైన సమయంలో డాక్టర్ నమ్రత మీడియాతో ఏమన్నారు..

"రాజస్థాన్‌కు చెందిన సోనియా, గోవింద్ సింగ్ నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ దంపతులు ఒక శిశువును దత్తతగా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. వారి అభ్యర్థన మేరకు మేం శిశువును దత్తత కోసం సిద్ధం చేశాం. అయితే, వారి మధ్య వ్యక్తిగత విభేదాలు రావడంతో, దత్తత వ్యవహారాన్ని పక్కన పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారు.

ఫెర్టిలిటీ చికిత్స కోసం వచ్చే దంపతులను సరోగసీ వైపు మళ్లించి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నానన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవే. నేను ఎప్పుడూ శిశువులను అమ్మకం చేయలేదు. కోవిడ్ సమయంలో కూడా ఈ దంపతుల వల్ల నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ సరోగసీ పేరుతో దత్తత విషయం చెప్పకుండా నాపై తప్పుడు కేసులు వేస్తున్నారు" అంటూ ఆమె మీడియాతో అన్నారు.