ఈ మధ్యన వెండితెర మీద డైలాగుల కన్నా కథలే రక్తి కట్టిస్తుంటే రాజకీయాల్లో మాత్రం డైలాగులే ఎవర్‌ గ్రీన్‌గా మారాయి. ముఖ్యంగా ఏపీలో అధికార-విపక్షాల మధ్య సాగుతున్న మాటల వార్‌లో పంచ్‌ డైలాగులే బాగా పాపులర్‌ అవుతున్నాయి. నాట్‌ ఓన్లీ డైలాగ్స్‌ టైటిల్స్‌ ఆల్‌ సో. ఇప్పుడు జగన్ కూడా అదే బాట పట్టారు.. జగన్‌ మాటలోనూ, తీరులోనూ మార్పులు మొదలైంది.


జగన్ లో మార్పు వచ్చిందా? 


నేను విన్నాను..నేను విన్నాను అనే డైలాగుతోనే ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న వైసీపీ అధినేత జగన్ భారీ మెజార్టీతో అధికారాన్ని అందుకున్నారు. మేనిఫెస్టోలో ఉన్నవి లేనివి కూడా ప్రజలకు అందిస్తున్నానని సిఎం చెబుతున్నా విపక్షాలు మాత్రం అవన్నీ రాసుకోవడానికి, చెప్పుకోవడానికే తప్ప అమల్లో మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేస్తోంది. అంతేకాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ పార్టీని గెలవనివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో కామేడ్రులు తప్ప ఏపీలోని విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. జనసేనతో బీజేపీ-టిడిపి కలిసి వైసీపీపై పోరుకి సిద్ధమవడమే కాదు రాజకీయముఖచిత్రం మారిపోతుందని హెచ్చరిక చేసింది. ఆ మాట చెప్పినప్పటి నుంచి జనసేన అధినేత దూకుడు పెంచారు. విశాఖ పర్యనటలో ప్రధాని మోదీని కలిశాక అటు నుంచే ఉత్తరాంధ్ర పర్యటన చేసి జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. రౌడీ సేన అన్న జగన్‌కి సెటైరికల్‌గానూ బదులిస్తూనే గత జైలు జీవితాన్ని గుర్తు చేసేలా కామెంట్లు చేశారు. 


చంద్రబాబుపై విమర్శలు వయా పవన్ కల్యాణ్‌ 


ఎప్పుడూ విపక్షాల విమర్శలకు మంత్రులు, వైసీపీ నేతలే బదులిస్తారు. కానీ ఇప్పుడు జగన్‌ కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేదికగా చేసుకొని విపక్షాల విమర్శలన్నింటికీ సమాధానమిస్తున్నారు. వెంట్రుక కూడా పీకలేరన్న మాటతో మొదలెట్టిన జగన్‌ ఇప్పుడు టిడిపి అధినేతపై ఉన్న వెన్నుపోటు రాజకీయాల గురించి కొత్త స్టైల్లో జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. నరసన్నపేటలో భూరక్ష కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌ సొంతంగా పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చానే కానీ మామ పార్టీని, ట్రస్ట్‌నే కాదు సిఎం పీఠాన్ని కూడా కబ్జా చేసిన చంద్రబాబుని కాదని ప్రజలకు కొత్తగా చెప్పారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లతో పోలిక పెట్టుకున్న జగన్‌.. టిడిపి అధినేతనే కాదు ఆయన్ని సమర్థిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మీడియాపై కూడా కొత్త స్టైల్లోనే విమర్శలు చేశారు. రామాయణ, మహాభారతంలోని రావణుడు, దుర్యోధనుడు వంటి రాక్షసులతో బాబు, పవన్‌లను వారిని సమర్ధిస్తున్న మీడియాని దుష్టచతుష్టయాలుగా వర్ణించారు జగన్‌. 


సిక్కోలు క్లీన్ స్వీప్....
కేవలం మాటల్లోనే కాదు ఆయన తీరులోనూ మార్పు వచ్చిందంటున్నారు దగ్గరగా చూసినవాళ్లు. ప్రజల చెంతకు సిఎం రాకపోయినా త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఇవే నా చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు మాటకు ఇండైరక్ట్‌గానే ప్రజలకు ఇలాంటి బాబుగారి సేవలు మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బైబై చెప్పిన మీరు వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు బైబై చెప్పేయాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌కి కూడా చురకలంటించేలా శ్రీకాకుళంజిల్లాకు గత ప్రభుత్వం 5ఏళ్ల పాలనలో ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం రూ.10వేల సాయంతోపాటు ఉచిత వైద్య సౌకర్యాలు, డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సిఎం. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడికి చెక్‌ పెట్టాలని , టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్న లక్ష్యంతోనే వైసీపీ అధినేత జగన్‌ ఈ జిల్లాపై వరాల జల్లు కురిపిస్తున్నారన్న టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.