Bapatla News: ప్రమాదవశాత్తు సముద్రం తీర ప్రాంతంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువతులను ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ అభినందించారు. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను రక్షించడంలో పోలీసులు ఎల్లపుడూ ముందుంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. నవంబర్ 20వ తేదీ కార్తీక మాసం చివరి ఆదివారం రోజు.. సముద్ర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎక్కువ మంది వచ్చారు. అయితే ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, మెరైన్ అదికారులు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలైన చిన్నగంజాం, రామాపురం, వాడరేవు, సూర్యలంక, నిజాంపట్నం వంటి ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో బందోబస్తును ఏర్పాటు చేశారు. 


ఈ క్రమంలోనే కొత్తపట్నం మెరైన్ ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో సముద్ర తీర ప్రాంతమైన వేటపాలెం మండలం రామాపురం - సీబ్రీజ్ పాయింట్ నందు మెరైన్ పోలీస్ స్టేషన్ కు చెందిన దార్ల పవన్ కుమార్ (పీసీ 3560), మోపిదేవి వెంకటేశ్వర్లు (పీసీ 1253)లు బందోబస్తు విధులు నిర్వహించారు. ఆ ప్రదేశంలోనే గుంటూరు సంపత్ నగర్ కి చెందిన సుమారు 50 మంది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సముద్ర స్నానాలు చేస్తుండగా.. కొల్లిపర అనిల్ ఇద్దరు కుమార్తెలు.. నీళ్లలో స్నానాలు చేయబోయారు. ఈ క్రమంలోనే 16, ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు నీళ్లలో కొట్టుకుపోయారు. విషయం గుర్తించి మెరైన్ కానిస్టేబుల్స్ పవన్, వెంకటేశ్వర్లు వెంటనే నీళ్లలోకి వెళ్లి ప్రాణాలకు తెగించి అమ్మాయిలను కాపాడారు. అయితే అప్పటికే యువతులు ఇద్దరు సముద్రపు నీరు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే వారికి సీపీఆర్, ప్రాథమిక వైద్య సేవలు అందించి తాగిన నీటిని కక్కించి వారి ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత వెంటనే మెరుగైన వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.   


సముద్రంలో మునిగిపోయిన ఇద్దరు యువతలను ప్రాణాలు సైతం లెక్కజేయకుండా వారిని రక్షించి, సముద్రపు నీరు త్రాగి మృత్యువుతో పోరాడుతున్న వారికి సిపిఆర్, ప్రాధమిక వైద్య సేవలు అందించి  ప్రాణాలు కాపాడిన దార్ల  పవన్ కుమార్ (pc 3560), మోపిదేవి వెంకటేశ్వర్లు (pc 1253) లను, పోలీస్ అదికారులను, బారి సంఖ్యలో పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి బాపట్ల జిల్లా ఎస్పీ గారిని బాధితుల కుటుంబ సభ్యులు, యాత్రికులు పోలీసులు స్పందించిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అమ్మాయిలను కాపాడిన కానిస్టేబుల్స్ పవన్ కుమార్, మోపిదేవీ వెంకటేశ్వర్లను పోలీసు అధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం  అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలను రక్షించడంలో పోలీసులు ఎల్లపుడూ ముందుంటారని, తమ ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా ప్రజలను రక్షిస్తారన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ.. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాటు కొత్తపట్నం మెరైన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.