Vizag AI Data Center | న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ (Google) అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులు, ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో జరిగిన భేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, నారా లోకేష్ పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఒప్పందంతో విశాఖలో ఒకేసారి ఏకంగా రూ.రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి. ఏపీలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో భాగంగా గూగుల్ తో చేసుకున్న ఒప్పందంతో విశాఖకు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి.
ఏ రంగాల్లో సేవలు అందిస్తుంది..
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏఐ శక్తి పేరుతో సమావేశం జరిగింది. గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హజరైన గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా కొందరు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్ధతో ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నామని గూగుల్ తెలిపింది. ఏఐ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానునంది.
విదేశాలకు విశాఖ ద్వారా కనెక్టివిటీ.. గూగుల్ క్లౌడ్ సీఈఓ
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. ‘గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారుతుంది. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాం. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. జెమినీ-ఏఐ (Gemini AI)తో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి.
డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. భారత దేశానికే కాదు... విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక అవుతుందని’ ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. అందుకు గూగుల్ అంగీకరించింది. నేడు ఒప్పందంపై సంతకాలు చేశారు.