వైజాగ్ జూలో వరుసగా జరుగుతున్న మరణాలు జంతు ప్రేమికుల్ని  కలవరపెడుతున్నాయి. జూలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆడ జిరాఫీ ఒకటి చనిపోయింది. పదేళ్ల వయస్సు గల ఆ జిరాఫీ  పేరు " మే ".  4 నెలల వయస్సులో మలేషియాలోని నెగెరా  జూ నుంచి  వైజాగ్‌ తీసుకొచ్చి జూలో పెట్టారు. అయితే గత కొంతకాలంగా క్రానిక్ మెట్రిటిస్ &న్యుమోనియాతో బాధపడుతున్న జిరాఫీకి అన్ని విధాలా చికిత్స అందించారు. అయినా లాభం లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం చనిపోయినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు. 


దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జూలలో వైద్యం చేస్తున్న నిపుణులను సంప్రదించి మే జిరాఫీకి చికిత్స చేసినట్టు సలారియా తెలిపారు. అయినా జిరాఫీని కాపాడలేక పోయామని విచారం వ్యక్తం చేశారామె. సాధారణంగా జిరాఫీల జీవిత కాలం  20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది. వైజాగ్ జూకి వచ్చే సందర్శకులకు జిరాఫీ " మే " ఒక స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేది. ఇప్పుడు అది చనిపోవడంతో సందర్శకులు  చాలా లోటుగా ఫీల్ అవుతున్నరని జూ సిబ్బంది చెబుతున్నారు.  


ఇటీవలే చనిపోయిన పెద్దపులి "కుమారి "
విశాఖ జూలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెల్లపులి ఒకటి చనిపోయింది. అది కూడా ఈ నెలలోనే చనిపోయింది. గత 16 ఏళ్లుగా వైజాగ్ జూలో సందర్శకులను అలరించిందీ కుమారి అనే పేరుగల తెల్ల పులి. ఆ పులి వృద్ధాప్యం కారణంగానే చనిపోయిందని జూ అధికారులు ప్రకటించారు.  


విశాఖ జూలో చనిపోయిన తెల్లపులి వయసు 19 ఏళ్ళు. ఆ పులి ఇప్పటి వరకు తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు. ఎప్పుడూ జూలో యాక్టివ్‌గా ఉండేదని దీన్ని చూసేందుకు చిన్నాపెద్దా అంతా ఆసక్తి చూపేవారని సిబ్బంది చెబుతున్నారు. 


తెల్లపులి మృతి ప్రభావం మిగతా పులులపై పడింది. వాటిలో కూడా ఉత్సాహం తగ్గిపోయిందని అంటున్నారు విశాఖ జూ సిబ్బంది. కొన్ని రోజులు డల్‌గా ఉండే పులులు ఈ మధ్యే కోలుకొని యథాస్థితికి వచ్చినట్టు వివరించారు. 


మార్చి నెల 12న రాణి అనే పేరుగల ఆడ జీబ్రా కూడా విశాఖ జూలో మృత్యువాత పడింది. దీనికి కూడా కారణం అనారోగ్యం అని అధికారులు అంటున్నారు. అయితే అతికొద్ది రోజుల గ్యాప్ లో విశాఖ జూలో జీబ్రా, టైగర్ ,జిరాఫీ వంటి అరుదైన జాతుల వన్యప్రాణులు మృతి చెందడం పట్ల జంతు ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.