Andhra Pradesh Quantum Computing Policy released: క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగంణలో జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అంశంపై కీలక ప్రసంగం ఇవ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదనిపిస్తోంది. ఈ రంగంపై నాకు చాలా పరిమితమైన అవగాహన మాత్రమే ఉంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇంత గొప్ప ప్యానల్ సమక్షంలో ఉండటం నాకు గర్వకారణంగా ఉందన్నారు.
కలలు కనడం కాదు..సాకారాం చేస్తాం !
ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో మనం కేవలం కలలు మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం. అందుకే భారతదేశ విజన్ ను సాకారం చేసేలా క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచామన్నారు. అమరావతిలో మొత్తం క్యాంటం వ్యాలీకి నాలుగు ముఖ్యమైన పునాదులు రూపొందించడం జరిగింది. మొదటిది అసలైన క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటుచేయడం, దానికి సంబంధించిన వినియోగ సందర్భాలు, పరిశోధనలను అభివృద్ధి చేయడం.. రెండోది దానికి సంబంధించిన సాప్ట్ వేర్ అభివృద్ధి, మూడోది ప్రతిభావంతమైన ఎకోసిస్టమ్ ను నిర్మించడం, నాలుగోది అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ అని తెలిపారు.
దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం
క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది. సీఎం చంద్రబాబు క్వాంటమ్ మిషన్ గురించి, క్వాంటం కంప్యూటర్ తీసుకురావాలని చెప్పినరోజు నేను చాట్ జీపీటీకి వెళ్లి క్వాంటమ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటని వెతికాను. ఇప్పుడు పూర్తిస్థాయి మిషన్ ను నిర్మించే స్థాయికి వచ్చామని చెప్పారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ(2025-30)ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నారా లోకేష్ సమక్షంలో క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో ఈ సందర్భంగా ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్ తో మంత్రి లోకేష్ భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరక్టర్ జెరెమీ జుర్గెన్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సైబర్ రక్షణ అంశంపై చర్చించారు. ప్రపంచం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో సైబర్‌సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలకం. అక్టోబర్ 2023 నుండి సెప్టంబర్ 2024 వరకు, భారతదేశంలో 369 మిలియన్లకి పైగా సైబర్‌సెక్యూరిటీ ఘటనలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి సైబర్‌దాడులు సుమారు $1 ట్రిలియన్ నష్టాలను కలిగించనుందని అంచనా. ఇవి చాలా ఆందోళనకరమైన అంశం. ఇవి కీలకమైన మౌలిక సదుపాయాలకు అడ్డంకులు సృష్టించి, ఆర్థిక అభివృద్ధి ప్రతిబంధకంగా మారతాయి. ఆంధ్రప్రదేశ్ ఐటి హబ్ గా అభివృద్ధి చెందుతోంది. మా రాష్ట్రంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే బలమైన సైబర్ సెక్యూరిటీ అవసరమన్నారు. ప్రభుత్వం పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రపంచ నిపుణులతో అనుసంధానించి సరికొత్త ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుందని లోకేష్ తెలిపారు.