ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులను ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో మరో పక్క పెద్ద పులి కూడా ప్రత్యక్షమై హడలెత్తిస్తుంది. ఎప్పుడూ ఈ ప్రాంతంలో పులి అనే పదమే వినిపించలేదు. కానీ ఇప్పుడు ఏ సమయంలో ఏ పక్క నుంచి వచ్చి మీద పడుతుందో అని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. 


ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమ-చిన్న దిమిలి క్వారీ వద్ద పులి కనపడింది. దాన్ని చూసిన వాచ్ మెన్‌ భయపడి..అక్కడ పని చేస్తున్న మిగిలిన వారికి తెలియజేశాడు. పులి సంచరిస్తుందన్న విషయం గురించి అక్కడి సిబ్బంది పోలీసులకు, అటవీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.


పెద్ద పులిని చూశానని చెప్పినప్పటికీ కొందరు వాచ్‌ మెన్‌ మాటలను ఖతారు చేయలేదు. కానీ ఆ ప్రాంతంలో పెద్ద పులి అడుగు జాడలను చూడగానే ఆ ప్రాంత వాసులు కంగారుపడుతున్నారు. 


ఎక్కడైతే పెద్ద పులి తిరిగింది అని చెబుతున్నారో ఆ ప్రాంతంలో అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను అలర్ట్‌ చేశారు. పులి ఈ ప్రాంతంలో తిరుగుతుంది కాబట్టి..జాగ్రత్తగా ఉండాలని వారు చెప్పారు. ఈ విషయం గురించి గ్రామాల్లో దండోరా వేయించారు. 


అసలే వర్షాకాలం..ఇప్పుడిప్పుడే పొలం పనులు నెమ్మదిగా మొదలు అవుతున్నాయి. ఈ సమయంలో పెద్ద పులి తిరుగుతుందని తెలియడంతో రైతులు, కూలీలు కలవరపడుతున్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలు కూడా పొలానికి వెళ్లిన తమ వారు తిరిగి వచ్చేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 


అటవీ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. పాలకొండ రేంజర్‌ తవిటి నాయుడు చిన్నదిమిలీ క్వారీ సమీపంలో ఉన్న పాదముద్రలను పరిశీలించారు. వాటిని పులి ముద్రలుగానే గుర్తించారు. హైనా కాకపోవచ్చని, పెద్ద పులి కానీ, చిరుత పులికానీ అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అది ఏంటి అనేది పాద ముద్రలు ద్వారా తెలుసుకుంటామని వివరించారు. 


పులి పాదముద్రికలు 13నుంచి 15 సెంటీ మీటర్లు ఉంటుందన్నారు. ఇప్పుడు సేకరించిన పాదముద్రలు అలాగే ఉన్నాయని వారు తెలిపారు. ఎవరికైనాన పులి కానీ, దాని జాడలు కానీ కనిపిస్తే అటవీ శాఖ సిబ్బందికు తెలియజేయాలని కోరారు. క్వారీ ప్రాంతంలో పులి కనిపించింది కాబట్టి క్వారీ సిబ్బంది, కార్మికులు జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరించారు.