Alluri Sitarama Raju District: ఒక వ్యక్తి తనకు సమస్య ఉందని చెప్పాడు లేదా తన ఊరికి సమస్య ఉందని చెప్పాడు. దీన్ని తెలుసుకున్న హీరో, బాధితుడు తన ఊరికి వెళ్లేలోపు సమస్యను పరిష్కరిస్తాడు. ఇలాంటి సీన్‌లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి రీల్ సీన్‌ ఇప్పుడు రియల్‌గా కనిపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడి అభ్యర్థనపై స్పందించిన ప్రభుత్వం క్షణాల్లో సమస్యను తీర్చింది. ఆ యువకుడు వేదిక దిగి ఇంటికి అధికారిక ఉత్తర్వులు తీసుకొని వెళ్లేలా చేసింది. 

Continues below advertisement

చాలా కాలం క్రితం వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో నియమితులైన యువకులకు మంగళవారం ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇక్కడ ఓ యువకుడి స్ఫూర్తికి అంతా ఆశ్చర్యపోయారు. ఆ యువకుడి ఉద్యోగం తన కుటుంబాన్నే కాకుండా యావత్ ఊరు రూపులేఖలనే మార్చేస్తోంది. రోడ్డు కావాలనే ఆయన కోరికను క్షణాల్లో మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో ఆ తండా వారి ఆనందం రెట్టింపు అయ్యింది. 

కానిస్టేబుల్‌గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీని వేదికపై తెలియజేశాడు. ఈ క్రమంలోనే తన గ్రామానికి రోడ్డు కూడా లేదని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు తెలియజేశాడు. రోడ్డు ఉండి ఉంటే తనలాంటి వాళ్లు చాలా మంది చదువుకొని ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డాడు. అందుకే తన ఊరికి రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించుకున్నాడు. 

Continues below advertisement

బాబూరావు కోరిక మేరకు గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రికి అప్పగించారు చంద్రబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు నుంచి పవన్ కల్యాణ్ వివరాలు తీసుకున్నారు. అక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించాలని పేర్కొన్నారు. అవసరమైన అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. 

ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. వాటిపై వెంటనే ఉప ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు .